కేటుగాడు

September 19, 2015 | 08:07 PM | 3 Views
Rating :
కేటుగాడు

నటీనటులు : తేజస్, చాందినీ చౌదరి, రాజీవ్ కనకాల, అజయ్, సప్తగిరి తదితరులు

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రాఫర్: మలహర్‌భట్ జోషి, ఎడిటింగ్ : పాసం వెంకటేశ్వర రావు, సంగీతం : సాయి కార్తీక్, నిర్మాత : వెంకటేష్ బాలసాని, దర్శకత్వం : కిట్టు నల్లూరి

ప్రకాశ్ రాజ్ ఉలవచారు బిర్యానితో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన తేజస్ హీరో, షార్ట్ ఫిల్మ్స్ తో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన నటి చాందిని చౌదరి. వీరిద్దరు జంటగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కేటుగాడు’. వెంకటేష్ మూవీస్ పతాకంపై వెంకటేష్ బాలసాని ఈ సినిమాను నిర్మించారు. ఓ కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇది ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం...

కథ :

కార్లు దొంగతనం చేసి అమ్ముకుంటూ సరదాగా జీవితాన్ని వెల్లదీసే ఓ యువకుడు చందు (తేజస్)... ఓ కారు దొంగతనం చేసే ప్రయత్నంలోనే చందు, ఒక పార్టీలో అకిరా(చాందినీ)ను చూసి మొదటిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆమె కిడ్నాప్ కి గురి కావటం, ఆ కారునే చందు దొంగతనం చేయడంతో కథ మొదలవుతుంది. మొదట చందుయే తనను కిడ్నాప్ చేశాడని అనుకున్న అకిరాకు ఆ తర్వాత అసలు నిజం తెలుస్తుంది. ఆ క్రమంలో అతడి ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత అసలు ట్విస్ట్ తెలుస్తోంది. అకీరా అన్నయ్య బిజినెస్ మెన్ శ్రీ ప్రకాష్ (రాజీవ్ కనకాల) ఈ కిడ్నాప్ వెనుక ఉన్నాడని. అదే టైంలో అజయ్ (అజయ్) కూడా అకీరా కోసం వెతుకుతుంటాడు. అసలు సొంత చెల్లెల్ని ప్రకాశ్ ఎందుకు కిడ్నాప్ చెయ్యాలనుకుంటాడు. అజయ్ కి అకీరాకి ఏంటి సంబంధం.  చివరికి ఏమైంది? అన్నదే కథ.

ఫ్లస్ పాయింట్లు:

సినిమాలో ఫ్లస్ పాయింట్లు అంటే మొదటి నుంచి చివరి దాకా ఉండే కమెడియన్ సప్తగిరి పాత్రే. టాక్సీడ్రైవర్ గా కడదాకా చిత్రాన్ని తన భుజస్కంధాలపై వేసి నడిపించాడు. ఇక చివరి 20 నిమిషాలు సినిమాకు మంచి అర్థాన్ని ఇచ్చింది. డల్ అయినప్పుడల్లా సప్తగిరి తన కామెడీతో నవ్వించి కాస్త రిలీఫ్ ఇస్తాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. చందుగా తేజస్ మంచి ప్రతిభనే కనబరిచాడు. కొన్ని పతాక సన్నివేశాల్లో ఇంకా ఆ స్థాయి నటనను ప్రదర్శించకపోయినా, ఓవరాల్‌గా బాగా నటించాడు. ఇక మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన చాందినీ, అకిరాగా బాగా నటించింది. అందం అభినయం రెండింట్లోనూ చాందినీ మంచి మార్కులే కొట్టేసింది. ఇక అజయ్, రాజీవ్ కనకాల, పృథ్వీ.. ఇలా అందరూ తమ పరిధిమేర బాగానే నటించారు.

మైనస్ పాయింట్లు :

కథ, కథనాలు మేజర్ మైనస్ లు. కొత్తదనం లేకుండా ఉంది. ఇలాంటి డ్రామాలు తెలుగులో ఇప్పటిదాకా చాలానే వచ్చాయి. తెలుగులోనే ఇప్పటికి చాలా చూసి ఉండడంతో కథ విషయంలో ఎగ్జైట్ అవ్వడానికి ఏమీ లేదు. ఇక కథనంతోనైనా ఈ లోటును కప్పించే ప్రయత్నం చేస్తారనుకున్నా ఆ విషయంలోనూ విఫలమయ్యారు. ఇక నటీనటులంతా తమ పరిధిమేరకు బాగానే నటించినా, ఏ పాత్రకూ సరైన క్లారిటీ లేనట్లు కనిపిస్తుంది. పాటలు చూడడానికి బాగానే ఉన్నా, అవేవీ సందర్భానుసారంగా రావు. కమర్షియల్ ఫార్మాట్‌లో పాటలు ఉండాలని అక్కడక్కడా వీటిని యాడ్ చేశారా? అనే అభిప్రాయం కలుగుతుంది. హీరోహీరోయిన్లు కూడా కొత్తవారు కావటంతో పతాక సన్నివేశాల్లో అంత బాగా చెయ్యలేదనిపిస్తుంది.

ఏమాత్రం ఆసక్తికరంగా లేని సన్నివేశాలతో లాక్కొచ్చి రచయితగా కొత్తదనం చూపించడంలో విఫలమయ్యాడు. ఇక దర్శకుడిగా బిట్స్ బిట్స్‌గా చూసినప్పుడు దర్శకుడి పనితనం చూడొచ్చు.

చివరగా :

తెలుగులో ఒక చిన్న సినిమా తనదైన ఐడెంటిటీ చూపించుకోవాలంటే కచ్చితంగా ఒక అందమైన ప్రేమకథతోనో లేదా ఓ డిఫరెంట్ జానర్‌తోనో వస్తే బాగుంటుందనేది ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కాన్సెప్ట్! ఆ నేపథ్యంలోనే గత కొద్దికాలంగా కిడ్నాప్, క్రైమ్, హర్రర్ ఈ తరహా సినిమాల హడావుడి పెరిగింది. అదే కోవలో ఓ కిడ్నాప్ డ్రామాగా మనముందుకు వచ్చిన చిత్రమే ‘కేటుగాడు’. కథలో కొత్తదనమేమీ లేకపోవడం, కథనం కూడా సాదాసీదాగా ఉండడం, క్లారిటీ లేని క్యారెక్టరైజేషన్స్.. ఇలా పలు ప్రతికూల అంశాలతో వచ్చిన ఈ సినిమా నిలవటం కష్టమే.

చివరగా... రోటీన్ కథే... కొద్ది రోజులు ఆగితే టీవీల్లో చూడొచ్చు.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు