కిక్ 2

August 21, 2015 | 03:50 PM | 15 Views
Rating :
కిక్ 2

నటీనటులు : రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, రవికిషన్, కబీర్, తనికెళ్ల భరణి, కోవై సరళ, పోసాని, సంజయ్ మిశ్రా, రాజ్ పాల్ యాదవ్, అశిశ్ విద్యార్థి తదిరులు

సాంకేతిక వర్గం :

కథ:  వక్కంతం వంశీ, కెమెరామెన్ : మనోజ్ పరమహంస, సంగీతం : ఎస్ఎస్ తమన్, నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకత్వం : సురేందర్ రెడ్డి

 

ఆరేళ్ల క్రితం మాస్ మహారాజా రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘కిక్’. మనం బాగుండటమే కాదు, పక్కవాడి సంతోషంలో అసలైన కిక్ ఉంటుందనే సందేశంతో వచ్చిందా చిత్రం. రవితేజ కెరీర్ లోనే ది బెగ్టెస్ట్ కమర్షియల్ సక్సెస్ మూవీగా నిలిచిపోయింది అది. మరిప్పుడు అదే డైరక్టర్, అదే రైటర్, అదే మ్యూజిక్ డైరక్టర్ కాంబోలో కిక్ -2 వచ్చింది. అది కిక్కు కోసమయితే ఇది కంఫర్ట్ కోసమని ట్యాగ్ లైన్ లోనే దర్శకుడు చెప్పకనే చెప్పాడు. మరీ చిత్రంతో డబుల్ కిక్ దొరికిందో లేదో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

కథ :

మొదటి భాగంలో పోలీస్ ఆఫీసర్ అయిన కళ్యాణ్(రవితేజ) పోలీస్ ఉద్యోగం మానేసి అమెరికాలో సెటిల్ అవుతాడు. ఫస్ట్ పార్ట్ లోని  పోలీస్ ఆఫీసర్ కళ్యాణ్ కృష్ణ(కిక్ శ్యామ్) అతన్ని కలవడానికి అమెరికాకి వస్తాడు.  అప్పుడు కిక్కు తన మెంటల్ కొడుకు గురించి చెబుతాడు. తాను కిక్కు కోసమే చూస్తే తన కొడుకు కంఫర్ట్ కోసం పాకులాడుతాడని చెప్పడంతో అసలు కథ ప్రారంభమౌతుంది.

రాబిన్ హుడ్ (రవితేజ) తన కంఫర్ట్ చూసుకునే స్వార్థమున్న  ఓ డాక్టర్. తన తాత (షాయాజీ షిండే) ఆస్తులన్నీ అమ్మేసి అమెరికాలో ఓ హాస్పిటల్ కట్టడానికి నిర్ణయించుకుంటాడు.  అందుకోసం బయలుదేరి ఇండియా వస్తాడు. కానీ తన ఆస్థిని డీడీ(ఆశిష్ విద్యార్థి) అనే ఓ డాన్ కబ్జా చేశాడని తెలుసుకుని అతని నుండి ఇంటి పత్రాలు సంపాదించే పనిలో ఉంటాడు. ఆ టైంలోనే రాబిన్ హుడ్ పండిట్ రవితేజ (బ్రహ్మానందం) ఇంట్లో అద్దెకు దిగుతాడు. అక్కడ పండిట్ రాబిన్ ను నానా రకాలుగా హింసిస్తాడు. ఈ క్రమంలో చైత్ర(రకుల్) పరిచయం అవుతుంది. రాబిన్ ప్రవర్తన నచ్చి అతనితో ప్రేమలో పడిపోతుంది. కానీ, రాబిన్ ఎవరినీ ప్రేమించే అవకాశం లేదని, కావాలంటే ట్రై చేసుకోమని చైత్రతో చెబుతాడు. ఆ కండీషన్ పై ఛైత్ర రాబిన్ హుడ్ తో స్నేహితురాలిలా మెలుగుతుంటుంది. ఇక తన ఆస్థి అమ్మకం పని పూర్తి కాగానే రాబిన్ అమెరికాకి ప్రయాణం అవుతాడు. కానీ తనకు తెలియకుండానే తాను ఛైత్ర ప్రేమలో పడిపోయినట్లు గ్రహిస్తాడు. ఇక తన ప్రేమ గురించి చెప్పే ప్రయత్నంలో ఉండగా ఓ ట్విస్ట్.  కొందరు దుండగులు చైత్రను కిడ్నాప్ చేస్తారు. ఇక రాబిన్ వారిని వెతుకుంటూ ఆమె ఊరికి బయలుదేరుతాడు. అక్కడికి వెళ్లిన రాబిన్ కి అనుకోని షాక్ తగులుతుంది. మరో వైపు ఇండియాలోని విలాస్ పూర్ లో మైనింగ్ వ్యాపారం చేసే సాల్మన్ సింగ్ ఠాగూర్(రవికిషన్) అక్కడ ప్రజలను భయభ్రాంతులను చేసి ఎదిరించిన వారందరినీ చంపేస్తుంటాడు. అతనికి భయపడి గ్రామస్థులు వారిని కాపాడే వ్యక్తి కోసం ఎదురుచూస్తుంటారు. అసలు ఛైత్ర ఎవరు? రాబిన్ హుడ్ ను ఎందుకు ప్రేమిస్తుంది? అసలు విలాస్ పూర్ గ్రామస్థులకు, రాబిన్ హుడ్ కి సంబంధం ఏమిటి? సాల్మన్ సింగ్ ఠాగూర్, రాబిన్ హుడ్ పాత్రలు చివరికి ఏమౌతాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

ఫ్లస్ పాయింట్లు:

ముందుగా చెప్పుకోవాల్సింది కథ గురించి. అక్కడ కిక్ కోసం అయితే ఇక్కడ కంఫర్ట్ కోసం. ఈ కాన్సెప్ట్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంచుకోవటంలో సఫలీకృతుడయ్యాడు. తన కంఫర్ట్ పక్కోడు ఏమైపోయినా ఫర్వాలేదు అని ప్రారంభంలో అనేకునే మనిషి ఆ తర్వాత పక్కవాడి కంఫర్ట్ కి ఎవడైనా ఇబ్బంది కలిగిస్తే రగిలిపోవటం ఇందులో ప్రధానాంశం.  ఇక హీరో రవితేజ నటన సినిమాకి హైలెట్. సినిమా కథకు తగిన విధంగా తండ్రి, కొడుకు పాత్రలో ఒదిగిపోవడం ఒక్క రవితేజకే సాధ్యమవుతుందా అన్న విధంగా నటించి మెప్పించాడు. కంఫర్ట్ కోసం పాకులాడే పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని ఒక్కడే లీడ్ చేశాడు. తన ఎనర్జీ లెవల్స్ ను ఎక్కడా తగ్గించుకోలేదు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తోపాటు మంచి పెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. పాటల్లో  గ్లామర్ లుక్స్ తో కవ్వించింది. వీరి తర్వాత చెప్పుకోదగింది విలన్ రవికిషన్ గురించి. రేసుగుర్రంతో పోలిస్తే విలన్ గా ఇంకా బాగా మెప్పించాడు రవి. గంభీరంగా కనిపిస్తూ సరదా సన్నివేశాల్లో కూడా మెప్పించాడు. ఇక మరో విలన్ కబీర్ కూడా బాగా చేశాడు. సెకండాఫ్ లో సంజయ్ మిశ్రా నటన బాగుంది. పండిట్ రవితేజగా బ్రహ్మానందం తన స్టయిల్ ఆఫ్ కామెడితో నవ్వించాడు. రాజ్ పాల్ యాదవ్ పాత్ర పరిమితమే అయినా చక్కగా నటించాడు. పోసాని కృష్ణమురళి, కోవై సరళ, సమీర్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టైటిల్ సాంగ్, ఈ తేనె కళ్లది.. మమ్మీకడుపులో.. సాంగ్స్ బావున్నాయి.  థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి సీన్ చాలా క్లియర్ గా, ఫ్రెష్ లుక్ తో చూపించాడు. మేకింగ్ వాల్యూస్ బావున్నాయి. రిచ్ నెస్ కోసం నిర్మాత కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు.  

మైనస్ పాయింట్లు :

ఇక చిత్రంలో మేజర్ మైనస్ రవితేజ్ లుక్స్. మరీ పెషెంట్ లా తయారవ్వటం వల్లనో ఏమో స్క్రీన్ పై చాలా డల్ గా కనిపిస్తాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో, ఎమోషన్ సీన్లో ఎబ్బెట్టుగా ఉన్నాడు. రకుల్ తో రోమాన్స్ సన్నివేశాల్లో అది మరీ క్లియర్ గా కనిపించింది. విలన్- హీరోకి మధ్యశత్రుత్వాన్ని పెంచే సన్నివేశాలు... ప్రేక్షకుడు మనసుకు తాకవు. ఆ వైరం సినిమాటిక్ గా ఉంది. అక్కడ ప్రేక్షకుల అంచనాలు తారుమారయ్యాయి. ఎమోషన్ తేవడంలో వక్కంతం వంశీ సురేందర్ రెడ్డి జోడీ ఫెయిలైంది. ప్రథమార్ధంలో వినోదం, ద్వితీయార్ధంలో యాక్షన్ ఈ మధ్య వచ్చే గంటన్నర కథ ప్రేక్షకులకు అంత కిక్ ఇవ్వదు. సెకండాఫ్ లో గ్రామస్థులు చేసే కామెడి పెద్ద నవ్వు తెప్పించదు. చాలా చోట్ల లాజిక్ మిస్సవ్వుతుంది. ఇక కిక్ లో ఫస్ట్ ప్రేమ్ నుంచి చివరి ప్రేమ్ దాకా కామెడీ ఉంటుంది. అది ఇందులో మిస్సయ్యింది. సినిమా లెంగ్త్ కూడా చాలా ఎక్కవయ్యింది. ఓ 20 నిమిషాల చిత్రానికి కొత విధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెకాంఢాఫ్ సాగదీతలా కొనసాగుతుంది. 

చివరగా :

మొదట్లో కంఫర్ట్ అంటే తను మాత్రమే బాగుండాలి అనుకునే హీరో చివర్లో తనతోపాటు చుట్టూవారు కూడా ఉండాలి అనుకోవటం ప్రధాన కాన్సెప్ట్. చివరికి అది తెలుసుకున్న హీరో న్యాయం కోసం చెడుతో పోరాడుతాడు. ఈ పాయింట్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి తన స్టయిల్ ఆఫ్ టేకింగ్ ముందుకు తీసుకెళ్లాడు. అయితే హీరో విలన్ మధ్య వైరానికి చాలా టైం పట్టడం బోర్ కొట్టిస్తుంది. దానికి తోడు తాగుబోతు క్యారెక్టర్లకు తెలుగు వాళ్లతోనే చెయ్యించొచ్చు కదా అన్న ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇలా చాలా చోట్ల సురేందర్ మేజర్ తప్పులు చేసుకుంటూ పోయాడు. అయితే,  కిక్ లాగానే కిక్ 2 కూడా మాస్ ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. అయితే కిక్ అనే టైటిల్ పెడుతున్నప్పుడు ఆ సినిమా రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందనుకుని వెళ్లే వారికి మాత్రం నిరాశ తప్పదు.

 

చివరగా... కిక్ లా  కామెడీని ఎక్స్ పెక్ట్ చెయ్యకుండా ఉంటే కంఫర్ట్ గా వెళ్లి చూసే సినిమా...



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు