నటీనటులు : నాని, మెహ్రీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, బేబి మోక్ష తదితరులు
సాంకేతిక వర్గం :
సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.
నానికి నేచురల్ స్టార్ టాగ్ లైన్ తగలడం ఏమోగానీ భలే భలే మగాడివోయ్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో తర్వాతి ప్రాజెక్ట్ జాగ్రత్తగా చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఎవరి అంచనాలకు అందకుండా నాని, ‘అందాల రాక్షసి’ దర్శకుడు హను రాఘవపూడితో సినిమా తీశాడు. అదే ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’. దర్శకుడి మొదటి చిత్రం ప్లాప్ అయినప్పటికీ టేకింగ్ పై నమ్మకం , పైగా నాని హీరో కావటంతో విడుదలకు ముందునుంచే పాజిటివ్ బజ్ నెలకొంది. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి నాని ఈ సినిమాతో మరో హిట్ అందుకున్నాడా? నష్టాల్లో ఉన్న 14 రీల్స్ కి ఊరట ఇస్తాడా? రివ్యూలోకి వెళ్దాం...
కథ :
కృష్ణ (నాని) స్వతహాగా ఓ పిరికివాడు. తన చిన్ననాటి స్నేహితురాలు మహాలక్ష్మి (మెహ్రీన్)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె కూడా అంతే. అయితే పరిస్థితుల ప్రభావంతో ఆ ప్రేమ వాళ్ళిద్దరి మధ్యే ఉంటుంది తప్ప ప్రపంచానికి తెలీదు. అయితే ఇంట్లో మహాను పెళ్లి సెటిల్ కావటంతో ఎలాగైనా తన ప్రేమను వాళ్ల ఇంట్లో చెప్పటానికి బయలుదేరుతాడు. ఈలోపు పగ, ప్రతీకారాలే తమ జీవిత ధ్యేయంగా బతికే అప్పిరెడ్డి, రాజన్నల మధ్య జరిగే ఫ్యాక్షన్ గొడవలు కృష్ణగాడి ప్రేమకథను తాకుతాయి. అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక ఈ ఫ్యాక్షన్ గొడవలోకి మాఫియా డాన్ డేవిడ్ భాయ్ (మురళీ శర్మ) వస్తాడు. ఇంకోవైపు ఏసీపీ శ్రీకాంత్ (సంపత్ రాజ్) పిల్లలు కిడ్నాప్ అవుతారు. అసలు వీడి వీరప్రేమ గాథలోకి వీరంతా ఎందుకోస్తారు? తన ప్రేమను దక్కించుకోవటంతోపాటు ఆ పిల్లలను కాపాడే బాధ్యత కృష్ణ తీసుకుని ఏం చేశాడు? ఎన్ని అవాంతరాలు దాటాడు? అదే కథ
ఫ్లస్ పాయింట్లు:
ఒక లవ్‌స్టోరీకి ఫ్యాక్షన్ బేస్డ్ స్టోరీని అల్లి చేసిన కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే హను రాఘవపూడి ఫ్రెష్ గా, కమర్షియల్ టచ్ ఇస్తూ చెప్పిన విధానం హైలెట్ అయ్యింది. ప్రేమకథలో ఇలాంటి ఓ కొత్త యాంగిల్ పరిచయం చేయడంతోపాటు, దానికి అదనంగా ఫన్‌ను జోడించాడు. సహజత్వంగా సాగిపోయే ఫన్, అద్భుతమైన ఎమోషన్ బాగా కుదిరాయి. సెకండాఫ్‌లో ముగ్గురు పిల్లలతో కలిసి హీరో చేసే ఓ ఎమోషనల్ జర్నీ బాగుంది. కమర్షియల్ అంశాలతో కథను నడిపిస్తూనే, చెప్పాలనుకున్న సెన్సిబుల్ పాయింట్‌ను దర్శకుడు సరిగ్గా చెప్పగలిగాడు.
ఇక నటీనటుల విషయానికొద్దాం... నాని మరోసారి సహజత్వంతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి డైలాగునైనా ఒక సెపరైట్ స్టైల్‌లో చెప్పడంలో దిట్ట అనిపించుకున్న నాని, తనదైన బ్రాండ్ యాక్టింగ్‌తో కట్టిపడేశాడు. యాక్టింగ్ పరంగా మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. ఎంటర్‌టైనింగ్, ఎమోషన్‌ను సమపాళ్లలో పండించాడు.
హీరోయిన్‌గా పరిచయం అయిన మెహ్రీన్.. అందం పరంగా, అభినయం పరంగా బాగా నటించింది. ముఖ్యంగా కొన్ని చోట్ల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ పలికించడంలో మెహ్రీన్ ప్రతిభను మెచ్చుకోవచ్చు. వీరి తర్వాత సినిమాకి బలం ముగ్గురు చిన్నారులు. బేబి నయన, మాస్టర్ ప్రదమ్, బేబి మోక్షలు నటనతో కట్టిపడేశారు. సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పృథ్వీ రాజ్, మురళీ శర్మ, సత్యం రాజేష్.. ఇలా క్యాస్టింగ్ పరంగా ఈ సినిమాకు వంక పెట్టలేం.
దర్శకుడిగా తన సెన్సిబిలిటీ అందాలరాక్షసి తో పరిచయం చేసిన హను, రెండో సినిమాకు అందులో మిస్సయిన ఎలిమెంట్స్ ను ప్రేక్షకుడికి చేర్చేందుకు బాగా కష్టపడ్డాడు. ఒక లవ్ స్టోరీ కి, చిన్న చిన్న కథలను జోడించి ఒక ఫుల్ లెంగ్త్ కథగా మార్చి అద్భుతంగా తీర్చి దిద్దాడు. అసలు ఇలాంటి పాయింట్ ను ఇంత ఎంటర్ టైనింగ్ చెప్పొచ్చా అన్న చందాన తీశాడు.
యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఆర్ట్ డైరెక్షన్, పాటల్లో సాహిత్యం.. ఇలా టెక్నికల్‌గా అందరూ తమ వంతు న్యాయం చేశారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ వినడం కన్నా విజువల్ గా బాగుంది. ముఖ్యంగా ‘నువ్వంటే నా నవ్వు’ అనే పాటను మరిచిపోలేం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చేసిన ప్రయోగం చాలా బాగుంది. ఎడిటింగ్ పరంగా మాత్రం మరింత జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. మహేష్ చిత్రాలు నిర్మించిన 14 రీల్స్ నిర్మాణ విలువలను ఏమనగలం.
మైనస్ పాయింట్లు :
అసలు కథనంతా ఫస్టాఫ్‌లోనే చెప్పేయడంతో సెకండాఫ్ అంత ఆసక్తికరంగా అనిపించదు. అయితే ముందే తెలిసిన ఒక సింగిల్ పాయింట్ చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది. నిజానికి ప్రీ ఇంటర్వెల్‌కి ముందున్న ట్విస్ట్ నే ఇంటర్వెల్‌గా మార్చేస్తే అవుట్ పుట్ మరింత అద్భుతంగా ఉండేది. ఇక సెకండాఫ్‌లో వచ్చే రెండు పాటలూ అవసరం లేకపోగా, ఎమోషన్‌ను పక్కదారి పట్టించేవిగా ఉంటాయి. కొన్ని చోట్ల అనవసరమైన సన్నివేశాలు ఎక్కువయ్యాయి అనిపిస్తుంది. హీరో పాత్ర కూడా కాసేపు సైడ్ అయిపోవటంతో కాస్త కన్ఫ్యూజన్ కలుగుతుంది.
చివరగా :
పాత కథలు రాజ్యమేలుతున్న ఇండస్ట్రీలో కొత్త స్క్రీన్ ప్లే ని జనాలు ఖచ్ఛితంగా ఆదరిస్తారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ కూడా ఇదే కోవలోకి వస్తుంది. రెగ్యులర్ కథలకు డిఫరెంట్ కథాంశంతో మెప్పించడంలో మాత్రం సక్సెస్ హను రాఘవపూడి సాధించాడనే చెప్పొచ్చు. ఎంటర్ టైనింగ్ ఫస్టాఫ్, ఎమోషనల్ సెకండాఫ్ వెరసి అన్ని వర్గాల ఆడియన్స్ అలరించేలా రూపుదిద్దాడు. వల్గారిటీ కూడా లేకపోవటం ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పిస్తుంది.
చివరగా... అమాయకత్వంతో కూడిన ఈ కృష్ణగాడి వీర ప్రేమగాథ అద్భుతంగానే ఉంది.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment