క్షణం

February 26, 2016 | 05:20 PM | 3 Views
Rating :
క్షణం

నటీనటులు : అడివి శేష్, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, రవి వర్మ, సత్యం రాజేష్, సత్యదేవ్ తదితరులు

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రహణం: శానీల్ డియో, మాటలు: అబ్బూరి రవి, కథ:  అడివి శేష్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాతలు: పరమ్ వి.పొట్లూరి - కవిన్ అన్నె. స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు - అడివి శేష్. దర్శకత్వం: రవికాంత్ పేరెపు

నటుడిగా కమ్ దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన అడవి శేష్ రెండో దాంట్లో దారుణంగా ఫేయిలయ్యాడు. కానీ, నటుడిగా మాత్రం సినిమా సినిమాకి పరిణితి చెందుతూ వస్తున్నాడు. ఇక ఈసారి తన స్నేహితుడైన రవికాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తానే ఓ కథను అందించాడు అడవి శేష్. బలుపు తర్వాత అసలు తెలుగులో హిట్ లేని పీవీపీ బ్యానర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఓ చిన్నారి కిడ్నాప్ డ్రామాతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏమేర ఆకట్టుకుందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

కథ :

ఎన్నారై రిషి (అడవి శేష్‌) ఇండియాలో మెడిస‌న్ చ‌దివేందుకు వ‌చ్చి అదే కాలేజ్ లో చ‌దివే శ్వేత (అదాశర్మ)తో ప్రేమలో పడతాడు. తనను ప్రేమించిన వెంటనే ఆ విషయాన్ని ఆమె తండ్రి ముందే శ్వేతకు చెబుతాడు. రిషీ అంటే న‌చ్చ‌ని శ్వేత తండ్రి వారికి ప్రేమ‌ను ఒప్పుకోడు. ఆమెను కార్తీక్ (సత్యదేవ్)కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. వెంట‌నే రిషీ అమెరికా వెళ్లిపోతాడు. కట్ చేస్తే  నాలుగేళ్ల తర్వాత శ్వేత ఓరోజు రిషికి ఫోన్ చేసి తనను కలవాలంటుంది. వెంటనే ఇండియా బయలుదేరి వచ్చిన రిషితో తన కూతురు రియా కిడ్నాప్ అయ్యిందని, తనను వెతకడానికి సాయం చేయాలని అడుగుతుంది. రిషి కూడా శ్వేతకు సాయం చేయడానికి అంగీకరిస్తాడు.

పాప రియా కోసం వెతుకుతున్న టైంలో పోలీసులు, స్కూల్ ప్రిన్సిపల్, శ్వేత ఇరుగుపొరుగులను కలిసిన రిషి, వాళ్లు చెప్పిన సమాధానంతో షాక్ అవుతాడు. రియా అనే అమ్మాయే లేద‌ని శ్వేత మాన‌సిక స్థితి స‌రిగా లేక‌పోవ‌డంతోనే త‌న‌కు కూతురు ఉన్న‌ట్టు ఊహించుకుంటోంద‌ని తెలుసుకుంటాడు. అదే టైంలో అనుహ్యంగా శ్వేత ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంది. దీంతో షాక్ కి గురవుతాడు రిషి. అసలు ఆమెకు నిజంగానే కుమార్తె ఉందా ? ఉంటే ఏమైంది? త‌న‌కు సాయం చేయాల‌ని శ్వేత రిషినే ఎందుకు అడిగింది ? శ్వేత చనిపోయాక రిషి ఆ ఇన్వేస్టిగేషన్ ఆపాడా లేదా?  అన్నదే కథ

ఫ్లస్ పాయింట్లు:

ఈ సినిమాలో ముందుగా చెప్పుకోదగింది హీరో అడవి శేష్ గురించి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన క్ష‌ణం సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను కూడా అందించిన శేష్ సినిమాలో కూడా అంతా తానే అయ్యి న‌డిపించాడు. సింపుల్ సీన్లలో కూడా అతను పండించిన హవభావాలు హైలెట్ గా నిలిచాయి. ఆదాశర్మ ఇలాంటి క్యారెక్టర్లకు ఫర్ ఫెక్ట్ గా సూటయ్యింది. తెలుగులో ఆమె ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో ఇందులో నటనే హైలెట్. హాట్ యాంకర్ అనసూయ పోలీసాఫీసర్ పాత్రలో కట్టిపడేసింది. ఏదో మొక్కుబడి పాత్ర కాకుండ ప్రాధాన్యం ఉన్న పాత్రలో అలరించింది. ముఖ్యంగా క్లైమాక్స్ టర్న్ చేసే పాత్రలో అనసూయ యాక్టింగ్ సూపర్బ్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా సత్యం రాజేష్ ఆకట్టుకున్నాడు. ఎంటర్ టైన్ మెంట్ మొత్తం అతని మీదే నడుస్తుంది. వెన్నెల కిషోర్, రవివర్మ, సత్యదేవ్ వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు.

              తెలుగులో ఇది కొత్త‌గా ఉన్న స్టోరీ కావ‌డం…ఉత్కంఠ‌తో ముందుకు సాగే స్ర్కీన్‌ప్లే కావ‌డంతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. డైరెక్ట‌ర్ ర‌వికాంత్ టేకింగ్ సూప‌ర్బ్‌గా ఉంది. ఇలా నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌ని మ‌లుపుల‌తో క్ష‌ణం మూవీ ముందుకు వెళ్ల‌డం ప్రేక్ష‌కులు కూడా సినిమాలో ఏం జ‌రుగుతుందా అని ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తారు.

టెక్నిక‌ల్ అంశాల విషయానికొస్తే... అడ‌వి శేష్ న‌టుడిగానే కాదు ఓ మంచి క‌థ‌కుడిగాను స‌క్సెస్ అయ్యాడు. తెలుగు తెర‌కు ఓ స‌రికొత్త స్టోరీని ప్ర‌జెంట్ చేసిన ఘ‌న‌త ద‌క్కించుకున్నాడు. గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లేతో ఏ ఒక్క సీన్ ను ప్రేక్షకుడు ముందుగానే ఊహించే అవకాశం లేకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్ గా సినిమాను నడిపించాడు. దర్శకుడు రవికాంత్ టేకింగ్ బాగుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే మూడ్ లో సినిమాను నడిపించటంలో రవికాంత్ సక్సెస్ అయ్యాడు. పాకల శ్రీచరణ్ సంగీతంతో ఆర్ ఆర్ మాత్రం సినిమాకు బాగా క‌నెక్ట్ అయ్యి ప్రేక్ష‌కుడు సినిమాతో పాటు ట్రావెల్ చేసేందుకు హెల్ఫ్ అయ్యింది. ఇక ఎడిటింగ్‌, సినిమాటోగ్ర‌ఫీ కూడా సినిమా స‌క్సెస్‌లో కొంత వ‌ర‌కు హెల్ఫ్ అయ్యాయి. ర‌న్ టైం త‌క్కువ ఉండ‌డంతో సినిమా ఫాస్ట్‌గా ముందుకు వెళ్లింది.

మైనస్ పాయింట్లు :

ఈ సినిమాకి మేజర్ మైనస్ చెప్పుకొదగింది పాటలే. అసలు ఈ చిత్రానికి పాటలు అవసరం లేదు కూడా. ఇక రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ ఆశించేవారికి నిరాశ ఎదరవుతుంది. స్లో మూడ్‌లో వెళ్లిన ఫ‌స్టాఫ్ ఈ సినిమాకు మైన‌స్ గా అనిపిస్తుంది. ఇంతకీ మించి ఇందులో మైనస్ లు వెతకలేం.

చివరగా :

కథ, కథనం, స్క్రీన్ ప్లే అన్నీ పకడ్బందీగా ఉంటే సినిమా ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా మనసును ఎంతగా ఆకట్టుకోగలదనటానికి క్షణం సినిమా ఓ ఉదాహరణ. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఎక్కడా టెంపో చెడనీయకుండా దర్శకుడు ఆసక్తికరంగా మలిచిన తీరు ప్రశంసనీయం. సినిమాలో పాత్రలన్నీ సహజంగా కథకు అవసరమైన తీరులోనే అవసరమైనమేరకే ఉండటంతో ఎక్కడా ప్రేక్షకుడికి వీళ్లు ఎక్ స్ట్రా చేస్తున్నారని అనిపించదు. మనమూ కథలో లీనమై కిడ్నాపైన పాప ఏమైంది? దొరుకుతుందా లేదా? అని టెన్షన్ పడతాం. ఇంటర్వెల్ కు ముందే హీరోయిన్ ను చంపేసినా అది కథలో మరింత ఆసక్తి కలిగించిందే తప్ప హీరోయిన్ లేకుండా ఎలా నడుస్తుంది అనే సందేహాన్నికలిగించదు. తర్వాత సీన్ లో ఏం జరుగుతుందోనని ప్రేక్షకుడు అస్సలు ఊహించలేడు.

చివరగా.. క్షణం  క్షణక్షణం ఉత్కంఠభరింతం. చూడదగ్గ ఫర్ ఫెక్ట్ థ్రిల్లర్.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు