లక్ష్మీ రావే మా ఇంటికి

December 06, 2014 | 03:29 PM | 26 Views
Rating :
లక్ష్మీ రావే మా ఇంటికి

నటీనటులు : నాగ శౌర్య, అవికాగోర్, నరేష్, రావు రమేష్, ప్రగతి, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు

సాంకేతిక వర్గం :

నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి, సంగీతం: కేఎం రాధాక్రుష్ణ, మాటలు, దర్శకత్వం: నంద్యాల రవి(తొలిపరిచయం).

‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో నాగ శౌర్య నటించిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. అవికా గోర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా నంద్యాల రవి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించగలిగిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

లక్ష్మీ నిలయం... ఈ ఇంటికి పెద్ద సర్వేశ్ ఆనంద్ రావు(రావు రమేష్). అతనికి ఇద్దరు కొడుకులు, ఒక ముద్దుల కుమార్తె.. తనే లక్ష్మీ(అవిక గోర్). అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రిక్ట్ గా ఉండే సర్వేశ్ రావు తన కుటుంబ సభ్యులను ఎంతో పద్దతిగా పెంచుతాడు. అనుకున్నట్టుగానే చదువు పూర్తి చేసుకొని జాబు తెచ్చుకున్న లక్ష్మీకి పెళ్లి చేయడానికి సర్వేశ్ ఆనంద్ రావు నిర్ణయించుకుంటాడు. అందులో భాగంగానే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. కట్ చేస్తే సాయి(నాగ శౌర్య) తన బిటెక్ ఫినిష్ చేసుకొని ఫ్రెండ్స్ తో కలిసి బాగా జులాయిగా తిరిగే కుర్రాడు. ఓ రోజు అనుకోకుండా లక్ష్మీని చూసిన సాయి ప్రేమలో పడతాడు. కానీ తన ప్రేమని చెప్పడానికి వెళ్ళిన సాయికి లక్ష్మీ తనకి నిశ్చితార్ధం అయిపోయిందని తెలిసి షాక్ అవుతాడు. అయినా ఆ రోజు నుంచి సాయి లక్ష్మీని ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తుంటాడు. కానీ, తండ్రి బాటలో ప్రయానించే లక్ష్మీకి ఇలాంటివి నచ్చవు. దీంతో సహజంగానే హీరోని ద్వేషిస్తుంటుంది. మరి సాయి తన లవ్ ని సక్సెస్ చేసుకోవడానికి ఏమేమి చేసాడు.? అలాగే లక్ష్మీ సాయిని ప్రేమించిందా.? లేదా.? చివరికి లక్ష్మీ-సాయి ఒకటయ్యారా.? లేక లక్ష్మీ వాళ్ళ నాన్న చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుందా.? అనేది కథ.

ఫ్లస్ పాయింట్లు:

సినిమా స్టార్టింగే చాలా ఫన్నీగా ఉంటుంది. టైటిల్స్ పడేప్పుడు వచ్చే గుడ్డు కథకి, పాత్రల పరిచయానికి ఉయ్యాల జంపాల ఫేం రాజ్ తరుణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ప్రేక్షకున్ని ఆకట్టుకుంటుంది. అలాగే మొదటి 40 నిమిషాలు సినిమా చాలా వేగంగా, ఎంటర్ టైన్ గా సాగిపోతుంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్లు కూడా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఇక పెర్ఫార్మన్స్ పరంగా చెప్పుకుంటే హీరో నాగ శౌర్య తన రెండు సినిమాలకంటే ఈ సినిమాలో ఇంకాస్త మెరుగ్గా నటించాడు. కానీ అందులో బడా స్టార్ లను ఇమిటేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ బాగానే అలరించాడు. ముఖ్యంగా నాగ శౌర్య ఇందులో డాన్సులు కూడా బాగా చేసాడు. ఇకపోతే అవిక గోర్ చూడటానికి ఇంకా చిన్న అమ్మాయిలానే కనిపిస్తున్నా అనిపించినా నటనలో మంచి మార్కులే కొట్టేసింది. చీరల్లో చూడటానికి అందంగా ఉంది. అవిక గోర్ ఫ్రెండ్ పాత్రలో విద్యారావు చాలా బాగుంది. ఇక రావు రమేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ పెద్ద పాత్రలో ప్రకాష్ రాజ్ తర్వాత అంతటి స్కోప్ ఉన్న పాత్రలో నటన ఆయనకే సొంతం. దొంగ పాత్రలో సప్తగిరి కనిపించేది కొద్దిసేపే అయినా కామెడీ అద్భుతంగా పండించాడు. సాఫ్ట్ వేర్ సుబ్రమణ్యంగా వెన్నెల కిషోర్ కూడా ప్రేక్షకులని నవ్వించాడు. నరేష్, ప్రగతి, వేణు, సత్యం రాజేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. చాలా రోజుల తర్వాత మ్యూజిక్ చేసిన రాధాక్రుష్ణ మ్యాజిక్ చూపించాడు. పాటలు బాగున్నాయి.

మైనస్ పాయింట్లు :

ఈ సినిమా మొదటి 40 నిమిషాలు ఎంత ఫాస్ట్ గా ఉంటుందో ఆ తర్వాత సినిమా అంత స్లో అయిపోతుంది. ఆ తర్వాత కథ పెద్దగా ముందుకు సాగదు. సెకండాఫ్ అంతా కథ ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అనే అనుమానం చూసే ఆడియన్స్ కి వస్తుంది. హీరోకి యాక్షన్ ఇమేజ్ ఇవ్వాలనే ఉద్దేశం తప్ప క్లైమాక్స్ లో ఫైట్ అవసరం లేదనే చెప్పాలి. అవికా గోర్ కూడా ఓవర్ మెచ్యూర్ పాత్రలో నటించిందనే చెప్పాలి. ఇకపోతే లాజికల్ గా నాకు ప్రేమ వద్దు అని వెళ్లిపోయే హీరోయిన్ చివర్లో హీరో దగ్గరికి ఎందుకు వస్తుందో క్లారిటీ లేదు. డైరెక్టర్ కథా ప్రకారం కొన్ని చోట్ల చాలా మంచి సీన్స్ ని రాసుకున్నప్పటికీ టేకింగ్ పరంగా మాత్రం సరిగా తీయలేదు. ఈ సినిమా డైలాగ్స్ లో కూడా ప్రాస ఎక్కువ, భావం తక్కువ అయ్యింది. నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్ తరహాలోనే ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయిని ప్రేమలో పడేసే కాన్సెప్టే ఇది కూడా. అన్ని సినిమాల్లోని సీన్లను కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది.

చివరగా :

వరుసగా రెండు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకున్న నాగ శౌర్య ఈ చిత్రంతో కొంత వరకూ మాత్రమే ఆకట్టుకోగలిగాడు. దర్శకుడు నంద్యాల రవి కూడా అనుకున్న కథను సగం వరకు మాత్రమే సరిగ్గా డీల్ చేయగలిగాడు. ఓవరాల్ గా నాగ శౌర్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, ఎంటర్టైనింగ్ గా సాగే ఫస్ట్ హాఫ్ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకి ప్రమోషన్ చాలా వీక్ గా ఉండడం కూడా ఈ సినిమాకి మరో మేజర్ మైనస్ పాయింట్. ఎ సెంటర్స్ లో ఏమో కానీ బీ, సీ సెంటర్లలో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకునే ఛాన్స్ లేదనే చెప్పాలి.

చివరగా సినిమాకు వెళ్లిన వారు ఫస్టాఫ్ తోనే సరిపెట్టుకోవల్సి వస్తుంది. సెకండాఫ్ మీ ఓపిక.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు