శ్రీమంతుడు

August 07, 2015 | 11:28 AM | 23 Views
Rating :
శ్రీమంతుడు

నటీనటులు : మ‌హేష్‌బాబు, శృతిహాస‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, సుక‌న్య‌, రాజేంద్రప్రసాద్‌, తులసీ, ఏడిద శ్రీరాం, ముకేష్ రుషి, సంప‌త్‌రాజ్, హరీష్, పూర్ణ‌, త‌దిత‌రులు

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రాఫ‌ర్‌: మ‌ది, సాహిత్యం: రామ‌జోగయ్య శాస్ర్తి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, బ్యాన‌ర్‌: మైత్రీ మూవీస్‌, మహేష్ బాబు (ఎంబీ) ప్రొడక్షన్, నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి, మోహ‌న్ చెరుకూరి(సీవీఎం), క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: కొర‌టాల శివ‌

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. వరుసగా రెండు చిత్రాలు (వన్, ఆగడు) నిరాశపరిచాయి. ఇప్పుడు మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడిగా ముందుకొచ్చాడు. ఎదుగుదల అంటే మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఎదగటం' ,'సాటి మనిషికి కష్టం అనేది చూడకపోతే మనము భూమ్మీద సంఘంలో బ్రతకటం ఎందుకు?' అన్న సందేశంతో శ్రీమంతుడు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఈసారి మాత్రం గురి తప్పనని, ప్రేక్షకులకు మంచి చిత్రంతో ఓ హిట్ ను అందిస్తానని మహేష్ ప్రకటించాడు. అలాగే ద్వితీయ విఘ్నం అఘాతాన్ని దాటి చూపుతానని దర్శకుడు కొరటాల శివ కూడా చెప్పేశాడు. మరి వీరిద్దరు ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించారా ? సామాజిక సృహ నేపథ్యం ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? రివ్యూలోకి వెళ్దాం...

కథ :

సింగిల్ గా ఫ్లైట్ లలో తిరిగే కెపాసిటీ ఉన్న మల్టీమిలినియర్ ర‌వికాంత్ (జగపతి బాబు) కొడుకే హర్ష (మహేష్ బాబు). తండ్రి కి జనాలన్న, అప్యాయతలన్నా విరక్తి ఉంటే, హర్ష మాత్రం బంధాలు-అనుబంధాలు అంటూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలోనే పెద్దయ్యాక తండ్రి మాట అస్సలు వినని మొండిఘటంలా తయారవుతాడు. బిజినెస్ అప్పగిద్దామన్న ఆలోచన హర్షకు చెబితే తనకు కావాల్సింది వెతుక్కుంటూ వెళ్తాడు. ఇలాంటి మేన‌రిజం ఉన్న హ‌ర్ష ఓ రోజు చారుశీల (శృతిహాస‌న్‌)ను చూసి ల‌వ్‌లో ప‌డ‌తాడు. ఇక ఆమె చదివే కాలేజీలో జాయిన్ అయ్యి ప్రేమలో పడేసేందుకు నానాతంటాలు పడతాడు. చివరికి ఇద్దరు ప్రేమలో పడే టైంలో చారుకి హర్ష ఓ ధనవంతుడి కొడుకని తెలిసి రిజెక్ట్ చేస్తుంది. సొంత ఊరు ఏదో తెలినీ వాడిని అస్సలు ప్రేమించనంటూ కటీఫ్ చెప్పేస్తుంది. ఇక తన సొంత ఊరు శ్రీకాకుళం దగ్గర దేవర కోటను చేరుకొని అక్కడ ఊరిని దత్తత తీసుకుంటాడు. నారాయణ(రాజేంద్ర ప్రసాద్) అనే పెద్ద మనిషితో కలిసి ఊరిని అభివృద్ధి చేసే పనిలో పడతాడు. ఇక వీరికి అడ్డుపడుతున్న ఆ ఊర్లోని విలన్లు వెంకట రత్నం(ముఖేష్ రుషి) శశి(సంపత్ రాజ్), రాధ(హరీష్) లను వాయించుకుంటూ తన పని తాను చేసుకుపోతుంటాడు. ఇంతలో తన కొడుకు  ఆ ఊర్లో ఉన్నాడని తెలిసిన రవికాంత్ హర్షని వెనక్కి తీసుకెళ్లిపోతాడు. అసలు రవికాంత్ కి దేవర కోటకు, నారయణకి, విలన్లకి ఉన్న సంబంధమేంటి? అన్నది కథ. 

ఫ్లస్ పాయింట్లు:

ఈ సినిమాకు ప్రధాన బలం కథ మరియు మహేష్ బాబు. స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబు ఊరును దత్తత తీసుకోవాలనే విభిన్నమైన కథనాన్ని ఎంచుకొని పెద్ద సాహసమే చేశాడు. రోటీన్ కామెడీ, పంచ్ డైలాగులు లాంటివి లేకుండా ఓ సామాజిక విలువలు ఉన్న కథతో కొరటాల అద్భుత ప్రయోగం చేశాడు. తన గత చిత్రం మిర్చి కూడా రెగ్యులర్ ఫార్మట్ అయినప్పటికీ ఇది మాత్రం పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్. కథలో ట్విస్ట్ లు ఒక్కొక్కటిగా ముడి వీడుతుంటే కలిగే ఆసక్తి అంతా ఇంతా కాదు. అలాగే తాను ఎంచుకున్న కథలో ఏమాత్రం లోపం లేదనేది స్పష్టంగా అర్థమైంది. వన్ తర్వాత తనలోని నటుడిని మహేష్ మరోసారి పూర్తిస్థాయిలో ఆవిష్కరించుకున్న సినిమా ఇదే. భారీ పంచ్ లు లేకపోయినా ఉన్న వాట్లోనే హీరోయిజాన్ని బాగా పండించాడు. మహేష్ బాబు లుక్స్ పరంగా చాలా అందంగా ఉన్నాడు. అలాగే క్యారెక్టరైజేషన్ కు తగ్గట్టుగా బాడీ లాగ్వేజ్ డిజైన్ చేసుకున్నాడు. యాక్షన్ పార్ట్ కోసం బాగా కష్టపడ్డాడు. తన క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ చూపించాడు. ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్పులు కూడా ట్రై చేశాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా పండించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు చేసిన గత చిత్రాలతో పోలిస్తే ఇందులో మంచి క్యారెక్టర్ చేశాడు. పవర్ ఫుల్ గా లేకపోయినా యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కి కరెక్ట్ గా సూటయ్యాడు. ముఖ్యంగా సెంటి మెంట్ లో బాగా చేశాడు. శృతీహాసన్ నేచురల్ గా నటించింది. గ్లామర్ పార్ట్ తో పాటు సెంటిమెంట్ సీన్లలో బాగా చేసింది. రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నవారిలో మెప్పించాడు. ఇక విజువల్ గా చిత్రానికి బలం చేకూర్చాడు కెమెరామెన్ మది. చిత్రం చివరి వరకు స్క్రీన్ ప్రజంటేషన్ ను బాగా చేశాడు.  ముఖ్యంగా విలేజ్ లోకేషన్లను అందంగా చూపాడు. రామ రామ సాంగ్స్ లో విజువల్స్ అద్భుతంగా చూపించాడు.  దేవీ మరోసారి తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. పాటలు ఆడియోనే కాదు వీడియో కూడా అదుర్స్. ముఖ్యంగా జత కలిసే, దిమ్మతిరిగే, జాగో సాంగ్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాతలు కొత్త వాళ్లయినా ఎక్కడా రాజీ పడలేదు. భారీగా ఖర్చుపెట్టి మరీ తీశారు. 

మైనస్ పాయింట్లు :

కథ సామాజిక నేపథ్యం ఉన్నది కావటంతో ఎక్కడా కామెడీ సీన్లు లేకుండా పోయాయి. ఆలీ ఉన్నప్పటికీ అతని కామెడీ కి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. దీంతో సినిమాలో కామెడీ లేని లోటు ఉండిపోయింది. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్నా... ఎంటర్ టైన్ మెంట్ ను ఆశించే వారికి ఇది కాస్త మింగుడు పడదు. ఫస్టాప్ నార్మల్ గానే నడుస్తుంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ప్రారంభమైన చిత్రం చివరి దాకా ఎమోషనల్ గా సాగటం ఆ మైనస్ ని పూడుస్తుంది. చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సుకన్యకి యాక్టింగ్ స్కోప్ ఇవ్వకపోవటం కూడా మైనసే. కానీ ఆమె లుక్స్ పరంగా బాగుంది. ఇంకా కొన్ని పాత్రలకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదనిపిస్తుంది. దేవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు పాత సినిమాలనే గుర్తు తెస్తుంది. కంటెంట్ బాగా ఉన్నప్పటికీ రెండున్నర గంటల నిడివి ఉండటంతో కాస్త బోరింగ్ ఫీలవుతారు. ఓ పది పదిహేను నిమిషాలు ట్రిమ్ చేయాల్సింది. 

చివరగా :

తెలుగులో కథాబలం ఉన్న చిత్రాలేవీ రావట్లేదని విమర్శలు వెలువెత్తుతున్న ఈ రోజుల్లో శ్రీమంతుడు మాములు కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఓ మంచి చిత్రం.  అలాగని ఇది సాదాసీదా చిత్రం అనుకుంటే పొరపాటే. భారీ భారీ పంచ్ డైలాగులు, కామెడీ తప్ప శ్రీమంతుడిలో అన్ని ఉన్నాయి. హీరోయిజం ఉంది. సెంటి మెంట్ ఉంది. ముఖ్యంగా మహేష్ నటన గుర్తుండిపోతుంది. రాజమౌళి తర్వాత కథబలంతోపాటు, హీరోయిజం ను ఎలివేట్ చేయగల సత్తా తనకుంది అని నిరూపించుకున్నాడు శివ. మొత్తానికి ఫ్యామిలీ ఆడియోన్స్ రీపిటెడ్ గా చూసే అన్ని ఎలిమెంట్లు ఉన్న చిత్రం శ్రీమంతుడు.

 

చివరగా... రిచ్ బట్ సింపుల్ గాయ్ శ్రీమంతుడు  అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. 



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు