నటీనటులు : రామ్, కీర్తి సురేష్, సత్యరాజ్, ప్రదీప్ రావత్, శ్రీముఖి, ప్రిన్స్, చైతన్యకృష్ణ తదితరులు
సాంకేతిక వర్గం :
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిషోర్ తిరుమల
ఒకే టైప్ ఆప్ సినిమాలు చేసుకుంటూ పోవటంతో రామ్ సినిమాలంటే జనాలకి విరక్తి వచ్చేసింది. పండగచేస్కో, శివమ్ అంటూ గతేడాది బోరింగ్ సినిమాలతో చుక్కలు చూపాడు రామ్. తన బాడీలాంగ్వేజ్ కి ఏ మాత్రం సంబంధం లేని క్యారెక్టర్లతో వరుసగా విసిగించేస్తూ వస్తున్నాడు. క్రమంగా రామ్ జడ్జిమెంట్‌పై జనాలకి నమ్మకం సడలింది. అయితే నేను శైలజ తొలి టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక విధమైన పాజిటివ్ బజ్ స్టార్ట్ అయింది. గతంలో తాను అలాంటి చిత్రాలు చేసిన చాలా తప్పు చేశానని, ఈసారి ఫీల్ గుడ్ మూవీని అందిస్తానని చెప్పటంతో కాస్త నమ్మకంతో థియేటర్లకు వెళ్లారు. మరీ థియేటర్ల వరకు జనాన్ని ఆకర్షించిన శైలజకి రెండున్నర గంటల పాటు ఆకట్టుకునే శక్తి వుందా? రివ్యూలోకి వెళ్దాం...
కథ :
చాలా మంది అమ్మాయిలని ప్రేమించి, విసిగిపోయిన హరి (రామ్) ఇక లవ్‌లో పడకూడదని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి శైలజ (కీర్తి సురేష్) కనిపిస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన హరికి మళ్లీ కథ మొదటికి వస్తుంది. హరి అంటే ఇష్టమే... కానీ, అతన్ని ప్రేమించడం లేదని శైలజ తేల్చేయడంతో దేవదాసుల మారిపోడు మన హీరో. కనీసం ఆమె కుటుంబాన్ని అయిన మెప్పించడానికని శైలు అన్నయ్య (ప్రిన్స్) సాయంతో వాళ్ల ఇంట్లోనే చేరతాడు. మరీ శైలజ మనసు మార్చాడా లేక వాళ్ల ఇంట్లో వాళ్ల సాయంతోనే శైలును గెల్చుకున్నాడా? బాగా స్ట్రిక్ అయిన శైలు పాధర్ (సత్యరాజ్) ను హరి ట్రాప్ చేయగలిగాడా? చివరికి ఏమైంది.
ఫ్లస్ పాయింట్లు:
రామ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీ, ఎమోషన్, రొమాన్స్ అన్నీ పండించాడు. సరిగ్గా వాడుకుంటే రామ్ నుంచి ఎలాంటి నటన రాబట్టవచ్చో ‘నేను శైలజ’ చూస్తే తెలుస్తుంది. మాస్ సినిమాల్లో ‘అతి’ వేషాలతోనే విసిగించే రామ్.. ఈ సినిమాలో ఆ అతి అంతా పక్కనబెట్టేసి పాత్రకు తగ్గట్లు ఒద్దికగా నటించాడు. హీరోయిజం చూపించాల్సిన సన్నివేశాల్లో కూడా సింపుల్ గానే చేశాడు. ఇందులో అతని నటన చూస్తే.. ఎప్పుడూ ఎందుకిలా చేయడు అనిపిస్తుంది. దర్శకుడు కమెడియన్ల మీద కూడా ఆధారపడకుండా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత కూడా రామ్ కే ఇచ్చాడు. అతడి పాత్రను అలా తీర్చిదిద్దాడు. రామ్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. బబ్లీ గర్ల్ కీర్తి సురేష్ ఫ్రెష్ గా అనిపించింది. ఆమె నటనలో పరిణతి ఉంది. కీర్తి హావభావాలు బాగున్నాయి. హీరోయిన్ తండ్రి పాత్రలో సత్యరాజ్ మరోసారి తన ప్రత్యేకత చూపించాడు. రోహిణి కనిపించే కొన్ని సన్నివేశాల్లోనే బాగా చేసింది. సినిమాలో అతి పెద్ద సర్ ప్రైజ్ ప్రదీప్ రావత్ పోషించిన మహర్షి పాత్రే. తొలిసారి ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేసి నవ్వించాడు ప్రదీప్. ప్రిన్స్ ని కూడా కామెడీకి వాడుకున్నారు. శ్రీముఖి, రోహిణి, నరేష్ తదితరులు సహాయ పాత్రల్లో తమ వంతు సహకారం అందించారు.
సాంకేతిక వర్గం విషయానికొస్తే... దర్శకుడు కిషోర్ ఈ చిత్రాన్ని పొయెటిక్‌గా తీర్చిదిద్దాడు. ఆరంభం నుంచి ఒక విధమైన మూడ్‌లోకి తీసుకెళ్లడానికే చూసాడు. దర్శకుడిగా అతని ప్రతిభని ప్రశ్నించలేం. డైలాగ్ రైటర్‌గా కూడా రాణించాడు. దేవిశ్రీప్రసాద్ పాటలు బాగున్నాయి. బిజిఎం కూడా ప్లస్ అయింది. సమీర్‌రెడ్డి అరకు అందాలని అద్భుతంగా బంధించాడు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి.
మైనస్ పాయింట్లు :
ద్వితీయార్ధానికి వచ్చేసరికి ఎప్పట్లాగే హీరో ‘దిల్ వాలే’గా మారిపోవడం.. అమ్మాయి కుటుంబాన్ని మెప్పించి తనను తీసుకెళ్లిపోవడం.. ఈ మధ్యలో హీరోయిన్ ఫ్యామిలీని కన్విన్స్ చేసే సన్నివేశాలు రొటీన్ అనిపిస్తాయి. దర్శకుడి నరేషన్ కూడా స్లో కావడం వల్ల ద్వితీయార్ధం ఇంకా భారంగా అనిపిస్తుంది. ఏ మలుపులూ లేకుండా మన అంచనాలకు తగ్గట్లు సాగిపోయే రొటీన్ కథనం నిరాశ పరుస్తుంది. ఐతే కొంచెం చమత్కారం జోడించిన క్లైమాక్స్ మళ్లీ ప్రేక్షకుల ముఖాల్లో నవ్వు పులుముకుని థియేటర్ నుంచి బయటికెళ్లేలా చేస్తుంది.
చివరగా :
రొటీన్ సినిమాలను పక్కన పెట్టి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ట్రై చేసిన ఫీల్ గుడ్ ప్రేమకథ ‘నేను.. శైలజ’ ప్రేక్షకులకు కూడా మంచి ఫీల్ ని అందించి, రామ్ కి కావాల్సిన హిట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. రామ్ పాత్రని డిజైన్ చేసిన విధానం, ఆ పాత్రలో రామ్ నటించిన తీరు, ఆయన డైలాగ్స్ ఇలా వన్ మాన్ ఆర్మీలా రామ్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. అటు యువతకి కనెక్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉండడమే ఆడియన్స్ ని ఆకర్షించే విషయం.
చివరిగా... రామ్ సినిమాల నుంచి రీఫ్రెష్ మెంట్ ఇస్తూ ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. వీకెండ్ ఎంజాయ్ చెయొచ్చు.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment