ఊపిరి

April 02, 2016 | 02:25 PM | 4 Views
Rating :
ఊపిరి

నటీనటులు : అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్, జయసుధ, ఆలీ, తనికెళ్ల భరణి, గాబ్రియల్, అనుష్క, శ్రియ, కల్పన, ప్రవీణ్ తదితరులు

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: గోపీసుందర్, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వంశీ పైడిపల్లి

ప్రయోగాత్మక చిత్రాలతో హ్యాట్రిక్ పూర్తిచేసుకుని ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో మన ముందుకు వచ్చాడు అక్కినేని నాగార్జున. తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ ఊపిరి. ఫ్రెంచ్ మూవీ ది ఇన్ టచ్ బుల్స్ ను ఆధారంగా చేసుకుని మన నేటివిటికీ తగ్గట్లు రూపొందించాడు దర్శకుడు వంశీపైడిపల్లి. ఈ  క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైంది. మరి దీని ఫలితం ఏమైందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ :

మెయిన్ కథలోకి సీన్ ఓపెన్ చేయగానే జైలు నుంచి బయటికి వస్తాడు ఆవారా కుర్రాడు శీను(కార్తీ). దొంగతనం కేసులో అరెస్టైన అతని పెరోల్ మీద బయటికి తీసుకువస్తాడు అతని మామ(అలీ).  సత్ప్రవర్తన చూపిస్తే త్వరగా కేసు నుంచి బయటపడొచ్చనే మార్గం చెప్పటంతోపాటు అందుకోసం దారులు కూడా చూపిస్తాడు. ఈ క్రమంలోనే పారాగైడ్లింగ్ లో మెడ భాగం నుంచి అంతా చచ్చుబడిపోయి వీల్‌చైర్‌కే అతుక్కుపోయిన బిలినీయర్ విక్రమ్ ఆదిత్య (నాగార్జున) ఇంటికి చేరతాడు. అక్కడ విక్రమ్ సెక్రటరీ (తమన్నా) ను చూసి ఫ్లాటయిపోయి, అక్కడ ఉద్యోగంలో చేరతాడు. అందులో భాగంగా విక్రమ్ బాగోగులను చూసుకోవటంతోపాటు క్రమంగా అతనికి దగ్గరై ఓ సొంత తమ్ముడిలా మారిపోతాడు. వారి మధ్య బంధం పెనవేసుకుంటున్న సమయంలో హఠాత్తుగా శీను విక్రమ్ ను వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు ఏంటి? అసలు విక్రమ్ ను మానసికంగా శీను ఎలా ఓదార్చాడు? చివరికి వారి ప్రయాణాలు ఎక్కడికి చేరాయి. ముగింపు ఏంటి? ఇలాంటి నేపథ్యంలతో కూడుకున్నదే ఈ ఊపిరి కథ.

ఫ్లస్ పాయింట్లు:

ముందుగా ఇలాంటి ఒక ప్రయోగాత్మక పాత్రను ఒప్పుకొని, దాన్ని పూర్తిస్థాయిలో సొంతం చేసుకొని చేసిన నాగార్జున గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! నాగార్జునకు ఈ సినిమాలో ఎక్కువగా క్లోజప్ షాట్స్ ఉన్నాయి. ఆయన ఏ స్థాయి నటుడో ఈ సినిమా చూస్తే ఇట్టే అర్థమైపోయేంత అద్భుతంగా ఈ పాత్రలో ఒదిగిపోయారు. ఇక శీను పాత్రలో కార్తీని తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా కార్తీ కట్టిపడేశాడు. అతడి కామెడీ టైమింగ్, పాత్రను సొంతం చేసుకున్న విధానం, ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించిన తీరు అన్నివిధాలా అబ్బురపరుస్తాడు. వీరిద్దరే ఈ సినిమాకి రెండు కళ్లు. వీరి తర్వాత చెప్పుకొదగింది ప్రకాశ్ రాజ్. ముఖ్యంగా కార్తీ, ప్రకాశ్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక  తమన్నా తన పాత్రలో బాగా నటించడంతో పాటు అందంగా కూడా ఉంది. సొంతంగా తమన్నాయే చెప్పిన డబ్బింగ్ కూడా బాగుంది. జయసుధతో పాటు శ్రియ, అనుష్క, అడివిశేష్, గాబ్రియల్ ల స్పెషల్ అప్పియరన్స్ మరో హైలైట్.

                        సాంకేతిక అంశాల పరంగా చూస్తే ఈ సినిమా అన్ని విధాలా ది బెస్ట్ అని చెప్పొచ్చు. గోపీ సుందర్ పాటలు అంతగా గుర్తుండకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. పీ.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అదిరిపోయిందనే చెప్పాలి. ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్‌కి వచ్చేసరికి కథలో మారుతున్న ఎమోషన్‌ను నటీనటులంతా ఎలా క్యారీ చేశారో, వినోద్ సినిమాటోగ్రఫీ కూడా అలాగే క్యారీ చేసింది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని ఇంటర్‌కట్స్ దగ్గర ఎడిటింగ్ మ్యాజిక్ చూడొచ్చు. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ సినిమాకు మరింత అర్థాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. పీవీపీ సినిమా నిర్మాణ విలువలను, సాహసాన్ని మెచ్చుకోకుండా ఉండలేం!

మైనస్ పాయింట్లు :

ఎంటర్ టైనింగ్ ఫస్టాఫ్ తర్వాత సినిమా కొద్దిసేపు నెమ్మదించినట్టు అనిపిస్తుంటుంది. పారిస్ నేపథ్యంలో ఈ సమయంలో వచ్చే కొన్ని సన్నివేశాలు కాస్త డల్ అనిపించినప్పటికీ ముగింపు వచ్చే సరికి కాస్త ఊపు అందుకుంటుంది.. తనికెళ్ల భరణి పాత్ర ఎంత పవర్ ఫుల్ గా చూపించినప్పటికీ, బిలినీయర్ విక్రమ్ ను చూసి భయపడటంతో ఆ పాత్ర తేలిపోతుంది. కార్తీ-ఫ్రెండ్స్ కి మధ్య కాస్త కామెడీ పెట్టి ఉండాల్సింది. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. పాత్ర ప్రధానంగా ఉన్న ఇలాంటి చిత్రాల్లో చెప్పుకొదగ్గ మైనస్ లు ఇంతకన్నా ఎక్కువ కనిపించవు.

చివరగా :

ఒక ఫ్రెంచ్ కథలోని బేసిక్ ఎమోషన్‌ను ఎక్కడా మార్చకుండా దాన్ని తెలుగు సినిమాకు, పద్ధతికి మార్చుకొని రాసుకున్న స్క్రీన్‌ప్లే కట్టిపడేసేలా ఉంది. చిన్న చిన్న ఎమోషన్స్‌ని కూడా కథలో చెప్పుకొచ్చిన విధానానికి ఎంత అభినందించినా తక్కువే! నాగార్జున కార్తీల జర్నీని సినిమా మొత్తం అలా చూస్తూండిపోయేలా సన్నివేశాలను రూపొందించిన తీరు అబ్బురపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే… సినిమా అయిపోయాక మొహంపై ఓ చిరునవ్వు మిగిల్చి, కళ్ళనుంచి చిన్నగా నీళ్ళు తెప్పించే సినిమాలు ఎప్పటికో గానీ రావన్నది నిజం.

చివరగా... ఊపిరి తెలుగు సినిమాకు కొత్త అర్థానిస్తుందనటంలో అనుమానమే లేదు.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు