నటీనటులు : రామ్, రాశీ ఖన్నా, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, వినీత్ కుమార్, నరేష్, పోసాని కృష్ణమురళి తదితరులు
సాంకేతిక వర్గం :
ఆర్ట్ ప్రకాశ్, సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, నిర్మాత : స్రవంతి రవికిషోర్, దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి
చిన్నవయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చి కొద్దీ కాలంలోనే హీరోగా ఎదిగాడు. కామెడీతోపాటు మాస్ అంశాలకు పెద్దపీట వేస్తూ స్టార్ గా ఎదిగాడు. అయితే కొన్నేళ్లుగా హిట్ లేదు. వరుసపెట్టి సినిమాలు చెయ్యటం, అవి మూస ఫార్ములాలో ఉండటంతో ప్రేక్షకులు తిరస్కరించడం అలవాటైపోయింది. చివరికి పండగచేస్కో అంటూ కామెడీ జోనర్ తో వచ్చినా అది వర్కవుట్ కాలేదు. దీంతో కాస్త ఛేంజ్ చేసి మాస్ ఫార్ములాతో వచ్చాడు. అదే శివమ్. నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డిని పరిచయం చేసిన ఈ సినిమాలో రామ్ కి జోడీగా రాశీ ఖన్నా నటించింది. స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ట్రైలర్ లో మాత్రం రెగ్యూలర్ ఫార్మాట్ లాగే అనిపించినా... ఎంటర్ టైన్ మెంట్ కి కొదవ ఉండదని హీరో రామ్ చెబుతూ వస్తున్నాడు. మరీ చిత్రం ప్రేక్షకులను అలరించిందో లేదో తెలియాలంటే... చలో టూ రివ్యూ …
కథ :
ఇద్దరు ప్రేమికుల కోసం ఎంత రిస్క్ అయినా చేసి పెళ్లి చేసే మనస్తత్వం ఉన్న యంగ్ కుర్రాడు మన శివ(రామ్). అవసరం అయితే ఈ విషయంలో ఫ్రెండ్స్ కి చుక్కలు చూపిస్తుంటాడు. శివ ఫాలో అయ్యే సిద్దాంతం మనకు నచ్చే అమ్మాయి ఎదురయ్యేంతవరకు ఎదురు చూడాలి, ఎదురొచ్చాక తన కోసం ఏమన్నా చేయాలి. అలాంటి మెంటాలిటీ ఉన్న హీరో ఒక ప్రేమ జంటకి పెళ్లి చేసి పారిపోతూ ఉన్న టైంలో అనుకోకుండా జడ్చర్ల ఏరియాని వణికిస్తున్న బోజి రెడ్డి(వినీత్ కుమార్) మనుషులని కొడతాడు. అలా కొట్టి వెళ్ళిపోతూ ఉన్న శివ తనూజ అలియాస్ తను(రాశీ ఖన్నా)ని చూసి ప్రేమలో పడతాడు. ఇక తనని వెతుక్కుంటూ కర్నూల్ వెళతాడు. ఇక తన వెంట పడుతూ తనని ప్రేమలో పడెయ్యడానికి ట్రై చేస్తుంటాడు. ఇక తన మనుషులని కొట్టి తన పరువు తీసిన శివని చంపాలని బోజి రెడ్డి మనుషులు వెతుకుతూ ఉంటారు.
మరోవైపు హైదరాబాద్ లో రౌడీయిజం, బిజినెస్ చేసే అభి(అభిమన్యు సింగ్) కూడా శివ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక్కడో ట్విస్ట్... శివ కోసం వెతికిన అభి, చివరికి శివని వదిలేసి తనుని ఎత్తుకెళ్ళిపోతాడు. అక్కడి నుంచి సినిమా ఏమైంది.? శివ కోసం వచ్చిన అభి తనుని ఎందుకు ఎత్తుకెళ్ళాడు.? అలాగే శివని మళ్ళీ తన ఊర్లోనే అందరి ముందు చంపి తన పరువును తిరిగి తెచ్చుకోవాలనుకున్న బోజి రెడ్డి నుంచి శివ ఎలా తప్పించుకున్నాడు.? అలాగే అభి లెక్కలు తేల్చి చివరికి తనుతో సెటిల్ అయ్యాడా లేదా అన్నది కథ.
ఫ్లస్ పాయింట్లు:
‘శివమ్’ సినిమా ప్రారంభం బాగుంటుంది. హీరో ఇంట్రడక్షన్, పాత్రని డీటైల్ గా వివరించి చెబుతూ రాసుకున్న మొదటి సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్ తర్వాతే వచ్చే పాట, పాటలో డాన్సులు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో రామ్, అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తో చేసే కొన్ని కామెడీ సీన్స్ బాగానే నవ్విస్తాయి. కృష్ణభగవాన్ ట్రైన్ ఎపిసోడ్, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్, జడ్చర్ల స్టేషన్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. ఎనర్జిటిక్ హీరో రామ్ కి ఇలాంటి పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. మరోసారి జోష్ ఉన్న పాత్రలో ఫుల్ ఎనర్జీతో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, పాటల్లో డాన్సులతో ఆకట్టుకున్నాడు. ఇక రాశీ ఖన్నా కాస్త బలుపు, ఈగో ఉన్న పాత్రలో బాగానే చేసింది. అది కాకుండా గత రెండు సినిమాలకంటే మించి ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించింది. పాటల్లో తన స్కిన్ షో అందరికీ స్పెషల్ ప్యాకేజీ లాంటింది. రామ్ – రాశీ ఖన్నాల టామ్ & జెర్రీ కెమిస్ట్రీ బాగుంది. ముహూర్తాలు, శకునాలు, సెంటిమెంట్స్ ని ఫాలో అయ్యే విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ అక్కడక్కడా బాగానే నవ్వించాడు. శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, కృష్ణ భగవాన్ మరియు ఫిష్ వెంకట్ ల ఎపిసోడ్స్ కొన్ని బాగానే పేలాయి.
ఇక సినిమాలో బెస్ట్ అని చెప్పుకోవాల్సి వస్తే పాటల కోసం ఎంచుకున్న లొకేషన్స్ సూపర్బ్. ఆ విజువల్స్ మాత్రం ఆడియన్స్ ని కొత్తగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. సెకండాఫ్ లో వచ్చే ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా ఎమోషనల్ గా ఉంటుంది. ఓవరాల్ గా అక్కడక్కడా వర్కౌట్ అయిన కామెడీ కూడా సినిమాకి మేజర్ ప్లస్. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగుంటుంది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్లు :
ఈ సినిమాకి పాజిటివ్ కన్నా నెగటివ్ పాయింట్లే ఎక్కువ చెప్పుకొవచ్చు. పాత సినిమాల హిట్ ఫార్మాట్ కథనే ఎంచుకున్నాడు. దాంతో పాత్రల పరిచయాలు అయ్యే సరికి సినిమా మొత్తం ఎలా ఉండబోతుందా అనేది ఈజీగా ఆడియన్స్ కి తెలిసిపోతుంది. అలాగే కథనం కూడా అంత ఆసక్తికరంగా లేకపోయింది. ఇలాంటి కథలతోనే వచ్చిన సినిమాలలో సక్సెస్ అయిన పాయింట్ అంటే కథనం బెటర్ గా ఉండడం అలాగే, కామెడీ బాగా వర్క్ అవుట్ అవ్వడం. కానీ ఇందులో కథనం మరియు కామెడీ అనుకున్న స్థాయిలో లేకపోవడం వలన సినిమా చాలా చోట్ల బోరింగ్ కొడుతుంది. ఇకపోతే ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేషాలను బాగా అంటే బాగా సాగాదీసేయడమే కాకుండా ఒకానొక టైంలో క్లైమాక్స్ బాగా సిల్లీగా మారిపోతోంది ఎందనే ఫీలింగ్ కూడా ఆడియన్స్ కి కలుగుతుంది.
అలాగే సినిమాకి రన్ టైం చాలా ఎక్కువ, దాదాపు 2 గంటల 48 నిమిషాల సినిమాలో ఒక 20 నిమిషాలన్నా తగ్గిస్తే సినిమా వేగం కాస్త పెరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే సినిమాలో కొన్ని అవసరం లేని ఫైట్స్, కామెడీ కోసం పెట్టిన కొన్ని అనవసర సీన్స్ సినిమాకి అవసరం లేదు. మొదటి 10 నిమిషాల తర్వాత నుంచి సినిమా ఊహాజనితంగా సాగుతుంది. పాటలు విజువల్స్ పరంగా చూడటానికి సూపర్బ్ కానీ సందర్భానుసారంగా కాకుద్నా పాట రావాలి కాబట్టి వచ్చేస్తున్నట్టు వస్తుంటాయి. ఇక లాజికల్ గా అయితే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అలాగే పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం లాంటి వారికి సరైన పాత్రలు లేవు, అలాగే వారి పాత్రలు అలా బిహేవ్ చెయ్యడానికి సరైన కారణం ఉండదు. ఇక మనం ఎంత రొటీన్ కమర్షియల్ సినిమాని ఎంచుకున్నా అందులో విలన్ అనే వాడు స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ విలన్ గా ఎంచుకున్న వినీత్ కుమార్ తీయండ్రా బళ్ళు, తిప్పండ్రా బళ్ళు అనే పిచ్ లో డైలాగ్స్ చెప్పిచడం వలన పీక్స్ సీన్స్ లో కూడా కామెడీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో... ఈ సినిమాలో విలనిజం అనేది పెద్దగా పండలేదు.
దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఓకే అనేలా ఉంది, అదే స్థాయిలోనే నేపధ్య సంగీతం కూడా ఉంది. సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళే రేంజ్ లో అయితే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లేదు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. ఇక పెద్దగా మెప్పించని వాటి విషయానికి వస్తే మధు ఎడిటింగ్ అస్సలు బాలేదు. అంత లెంగ్త్ ఉన్న సీన్స్ ఉన్నాయి, అలాగే అనవసరమైన సీన్స్ ఉన్నా ఆయన ఏ మాత్రం వాటిని కత్తిరించలేదు.
చివరగా :
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నుంచి వచ్చిన ‘శివమ్’ సినిమా ఆడియన్స్ చేత జస్ట్ ఓకే అనే పించుకునేలా ఉందే తప్ప పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. పాత కథ అయినా అనుకున్న స్థాయిలో కామెడీ వర్క్ అవుట్ కాకపోవడం బిగ్గెస్ట్ మైనస్. రొటీన్ కథ, బోరింగ్ కథనం, లాంగ్ రన్ టైం, కడుపుబ్బా నవ్వించలేకపోయిన కామెడీ ఉండడం, వీక్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. రెగ్యులర్ కమర్షియల్ అంశాలను, నిడివి పెద్దగా ఉన్నా పర్లేదు అనుకునే ఆడియన్స్ ఈ సినిమాని చూడచ్చు.
చివరగా... కొత్త దర్శకుడు... పాత పచ్చడి... కొత్త డబ్బా... సేమ్ రిపీటెడ్ మైండ్ గేమ్ ఫార్ములా. చూడటం మీ ఓపిక.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment