సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

January 30, 2016 | 02:39 PM | 2 Views
Rating :
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

నటీనటులు : రాజ్ తరుణ్, అర్తన బిన, రాజా రవీంద్ర, షకలక శంకర్, తదితరులు….

సాంకేతిక వర్గం :

సంగీతం : గోపీ సుందర్, నిర్మాత : ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టిథ, దర్శకత్వం : శ్రీనివాస్ గవిరెడ్డి

ఇప్పుడున్న జనరేషన్ హీరోల్లో కష్టతరమైన హ్యాట్రిక్ ఫీట్ ను అవలీలగా సాధించాడు రాజ్ తరుణ్. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయిన యువనటుడు  ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21F’.. ఇలా వరుస హిట్స్ తో హ్యాట్రిక్ హీరోగా నిలబడ్డాడు. మరి ఆ సక్సెస్ ట్రాక్‌ను కొనసాగించే ఆలోచనతో మరో లవ్‌స్టోరీతో మన ముందుకు వచ్చాడు. అదే ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి రాజ్ తరుణ్ సక్సెస్ జోష్‌ కంటిన్యూ అయిందా లేదా అన్నది చూద్దాం...

కథ :

భవిష్యత్‌ గురించి పెద్దగా పట్టింపుల్లేని, అల్లరి చిల్లరిగా తిరిగే శ్రీ రామ్(రాజ్ తరుణ్), చిన్నప్పట్నుంచీ అదే ఊర్లో ఉండే సీతా మహాలక్ష్మి(అర్తన)ని అమితంగా ప్రేమిస్తూంటాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతో ఇష్టమైన క్రికెట్‌నే కాదనుకున్న రామ్, సీతకు తన ప్రేమను వ్యక్తపరిచే విషయంలో మాత్రం ప్రతిసారీ విఫలమవుతుంటాడు. ఇదిలా ఉండగానే.. సీత, పై చదువుల కోసమని హైద్రాబాద్‌కు వెళ్ళిపోతుంది. కేవలం సెలవుల్లో మాత్రమే ఊరికి వచ్చే సీతకు, తన ప్రేమను వ్యక్తపరచడానికి రామ్ విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు.

ఈ క్రమంలోనే ఓసారి సెలవుల్లో ఊరికి వచ్చినపుడు సీత, రామ్‌కు దగ్గరవుతుంది. మొదట కాదన్న, తర్వాత అతడిని అర్థం చేస్కొని ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే తన కూతురిని చేసుకునే వాడు మంచి పేరున్న వాడవ్వాలని కోరుకునే సీత తండ్రి, ఇంటర్ కూడా పూర్తి చేయని రామ్‌ను అల్లుడిగా ఒప్పుకోకపోగా ఆమెకు వేరెకరితో పెళ్ళికి ఫిక్స్ చేస్తాడు. మరి తన మామతోపాటు ప్రేమకు అడ్డైన ఆమె అన్నయ్య, పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి వాటిన్నింటిపై పోరాడి రామ్‌, సీతను ఎలా దక్కించుకున్నాడన్నదే కథ.

ఫ్లస్ పాయింట్లు:

మేజర్ ప్లస్ పాయింట్ అంటే హీరో రాజ్ తరుణ్ అనే చెప్పుకోవాలి. తనదైన మార్క్ డైలాగ్ డెలివరీతో, ఎక్కడా నెమ్మదించని యాక్టింగ్ స్కిల్‌తో, స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాను తన భుజాలపై మోసుకొచ్చాడు. ఇక హీరోయిన్‌గా నటించిన అర్తన చాలా అందంగా ఉండడంతో పాటు బాగా నటించింది. హీరో గ్యాంగ్‌లో భాగమైన షకలక శంకర్, నవీన్ తదితరులు బాగా నవ్వించారు. హీరోయిన్ తండ్రిగా నటించిన రాజా రవీంద్ర మంచి ప్రతిభ చూపారు.

ఇక సినిమా పరంగా చూసుకుంటే ఈ సినిమాకు హైలైట్ అంటే పంచ్ డైలాగులతో చాలా చోట్ల నవ్వించే ప్రయత్న చేయడం గురించి చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ మొత్తం హీరో, హీరోయిన్‌కు ప్రేమను వ్యక్తపరచడమనే అంశంపైనే నడుపుతూ సరదాగా, ఎక్కడా డ్రాప్ అవకుండా బాగానే నడిపించారు. రొటీన్ అయినా కూడా బేసిక్ లవ్ స్టోరీ బాగుంది. పాటలన్నీ వినడానికి, చూడడానికి బాగున్నాయి. సెకండాఫ్‌లోనే వచ్చే రెండు, మూడు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది సంగీత దర్శకుడు గోపీ సుందర్. మళయాలంలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన గోపీ సుందర్, తెలుగులో ఇప్పటివరకూ చేసిన సినిమాల్లానే ఈ సినిమాలోనూ పాటలన్నీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగానూ గోపీ సుందర్ బాగా ఆకట్టుకుంటాడు. విశ్వ సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగ్గ మూడ్నుర క్యారీ చేస్తూనే గ్రామీణ వాతావరణాన్ని ప్రేమకథ నేపథ్యానికి చక్కగా సెట్ చేశాడు. అనీల్ మల్లెలతో కలిసి శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. . ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఓకే.

మైనస్ పాయింట్లు :

ఈ సినిమాకు ఎంచుకున్న అసలు కథనే మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. హీరో, హీరోయిన్‌లు ప్రేమించుకోవడం, వారి ప్రేమకు కొన్ని పరిస్థితులు, వ్యక్తులు అడ్డురావడం, వీటన్నింటినీ ఎదిరించి హీరో తన ప్రేమను సొంతం చేసుకోవడం అన్న బేసిక్ లైన్ రొటీన్ అయినా కూడా ప్రేమకథల్లో ప్రధానంగా ఉండేది ఇదే కావడంతో ఈ లైన్‌లో ఏ సమస్యా లేదు. అసలు సమస్య ఈ బేసిక్ లైన్‌కు క్రికెట్‌ను కలిపి, క్రికెట్ పందెంలో గెలిచిన వారికి అమ్మాయి సొంతం అవుతుందన్న ఆలోచన మాత్రం అస్సలు సూటవ్వలేదు. దీంతో అసలు కథే సెకండాఫ్ను  మైనస్‌గా నిలబెట్టింది.

ఇక రామ్, సీతల ప్రేమకథలో పెద్దగా ఎమోషన్ లేదు. హీరోయిన్, హీరో ప్రేమలో పడిపోవడం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. రామ్ పాత్రను పక్కనబెడితే మిగతా అన్ని పాత్రలకూ సరైన పాత్ర చిత్రణ లేదు. పూర్తిగా కామెడీనే నమ్ముకోవడం అనే అంశం వల్ల కొన్నిచోట్ల సన్నివేశాల్లో అతి ఎక్కువ అయింది.

చివరగా :

‘ఉయ్యాల జంపాల’లోని ఇన్నోసెన్స్, రెండో సినిమా అయిన ‘సినిమా చూపిస్త మావా’లోని ఫన్.. ఈ రెండింటినీ మిక్స్ చేసి చెప్పే ప్రయత్నం చేసిన రొటీన్ లవ్‌స్టోరీయే ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. అయితే ఈ సినిమాలో ఈ రెండింటినీ సరిగ్గా వాడుకోవడంలో, ఆ రెండు అంశాలతో ఓ కథ చెప్పడంలో ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేని ప్రయత్నంగా మిగిలింది.

 

చివరగా... ఈ రామయ్య చేసిన సిత్రం చాలా సినిమాల్లో చూసిందే.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు