నటీనటులు : సంపూర్ణేష్ బాబు, సనమ్, భవాని, పృథ్వి తదితరులు
సాంకేతిక వర్గం :
సంగీతం: శేషు కె.ఎం.ఆర్, మాటలు: డైమండ్ రత్నం, సమర్పణ: డా.యమ్.మోహన్‌బాబు, సంస్థ; 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నిర్మాత; మంచు విష్ణు, దర్శకత్వం; అక్షత్ అజయ్ శర్మ
సింగం 123 పేరు వినగానే అందరికీ పెదాలపై చిరునవ్వు. కారణం ఆ టైటిల్. అందులో నటించిన హీరో. కొందరు కష్టపడి పేరు తెచ్చకుంటారు. కొందరికి పేరు అనేది దానంతట అదే వచ్చేస్తుంది. కానీ ఫేస్ బుక్ లో పబ్లిసిటీ ద్వారా పేరు తెచ్చుకున్న కామన్ మేన్ సంపూర్ణేష్ బాబు. మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా తన సంస్థలో సంపూర్ణేష్ బాబుతో ఓ సినిమా చేయాలని అనుకున్నారంటే సంపూర్ణేష్ బాబు పేరు మాస్ లో ఎంతగా చొచ్చుకుపోయిందో ఊహించవచ్చు. జనాలకు గిలిగింతలు పెడుతుందనుకున్న ఈ సినిమా నిజంగానే నవ్వులు పూయించిందా? పెదవులు విరిచేలా చేసిందా? చూద్దాం...
కథ :
సింగం123 (సంపూర్ణేష్ బాబు) నిజాయతీగల పోలీస్ ఆఫీసర్. నీతిని, ధర్మాన్ని కాపాడటానికి ఎంతటికైనా తెగించే వ్యక్తి. అతని నిజాయతీని గుర్తించి ప్రభుత్వం అతన్ని సింగరాయకొండకు బదిలీ చేస్తుంది. అక్కడ లింగం(భవాని) అనే వ్యక్తి చేసే అక్రమాల గురించి సింగం పసిగడతాడు. అతని అన్యాయాలను క్షుణ్ణంగా తెలుసుకుంటాడు. వాటిని తుదముట్టించడానికి కృషిచేస్తాడు. దాంతో అతనికి భవాని పలు అడ్డంకులను సృష్టిస్తాడు. వాటి నుంచి సింగం బయటపడ్డాడా? లేదా? నిజానికి సింగం పోలీసాఫీసరేనా? సింగరాయకొండతో వ్యక్తిగతంగా అతనికున్న అనుబంధం ఏమిటన్నది ఆసక్తికరం.
ఫ్లస్ పాయింట్లు:
సినిమాను ఆద్యంతం భుజాలపై మోసింది సంపూర్ణేష్ బాబు. చాలా తెలివిగా నటించాడు. ఇతర హీరోలను అనుకరించడం గతంలోనూ సంపూర్ణేష్‌బాబుకు ప్లస్ అయింది. ఇప్పుడు కూడా అదే అతనికున్న పెద్దబలం. పలు సన్నివేశాల్లో అతను కనబరిచిన వైవిధ్యమైన నటన చాలా పెద్ద ప్లస్ అయింది. డైమండ్ రత్నం రాసిన డైలాగులను సంపూ చెప్పిన తీరు కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. హీరోయిన్ కనిపించిన సన్నివేశాల్లో బాగానే ఆకట్టుకుంది. పాటలు కూడా అక్కడక్కడా బావున్నాయి. ఈ సినిమాను విష్ణు అందించిన కథ, స్కీన్ ప్లే ను గురించి కూడా ప్రస్తావించాలి. లాజిక్‌లని ఆశించకూడని కథ ఇది. స్ఫూఫ్ ప్రధానంగా సాగిపోతుంది. మరీ ముఖ్యంగా స్క్కీన్ ప్లే సినిమాకు హైలైట్ అనిచెప్పొచ్చు. వైవా హర్ష, పృథ్వి పాత్రలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇతర పాత్రధారులు కూడా వారి పరిధిమేరకు చక్కగా నటించారు. ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పుకుని తీరాల్సిందే.
మైనస్ పాయింట్లు :
శేషు ఇచ్చిన సంగీతం గొప్పగా లేదు. ఏదో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. డైరక్షన్ కూడా గొప్పగా అనిపించదు. సోసోగానే ఉంటుంది. లాజిక్ లు లేకపోవడంతో అక్కడక్కడా బోరు కొడుతుంది. వినిపించే డైలాగులకు ఆ కాసేపు నవ్వడం తప్ప ఆలోచించాల్సిన అవసరం ఏమీ అనిపించదు. సెకండాఫ్‌లోనూ కొన్ని అనవసరమైన సన్నివేశాలు కథలో ఫ్లోని దెబ్బతీసేలా ఉన్నాయి.
చివరగా :
తెలుగు సినిమా పరిశ్రమ మారుతోంది అనడానికి ఈ సినిమా పెద్ద ఉదాహరణ. సంపూర్ణేష్ హీరోగా విష్ణు కథ, స్క్రీన్ ప్లేను సమకూర్చి సినిమా చేయడమేంటని అందరూ తొలుత ఆశ్చర్యపోయారు. ప్రేక్షకులకు నచ్చింది చేయడమే పరిశ్రమ ఉద్దేశం అనే విషయాన్ని విష్ణు మరోసారి నిరూపించారు.
చివరగా... చీకూచింతా లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగులకు దూరంగా, హాయిగా కడుపారా నవ్వుకోవడానికి మాత్రమే ఈ సినిమా పనికొస్తుంది. అంతేగానీ అర్థం లేదంటూ లాజిక్కులకోసం వెతికే పని చేస్తే ప్రయోజనం శూన్యం. సింగం123 నవ్వులు మాత్రం కురిపిస్తాడు.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment