సోగ్గాడే చిన్నినాయనా

January 16, 2016 | 05:38 PM | 3 Views
Rating :
సోగ్గాడే చిన్నినాయనా

నటీనటులు : అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, బ్రహ్మానందం, నాగబాబు, నాజర్, సంపత్, అనుష్క, హంసానందిని, అనసూయ, దీక్షాపంత్ తదితరులు

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రహణ: పి.ఎస్.వినోద్ సిద్దార్థ్, మూలకథ: రామ్మోహన్, స్క్రీన్ ప్లే: సత్యానంద్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాత: అక్కినేని నాగార్జున, రచన, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ

దాదాపు ఒకటిన్నర ఏడాది గ్యాప్ తీసుకున్న కింగ్ నాగార్జున నుంచి వస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. చాలా గ్యాప్ తర్వాత మరోసారి నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ తన హోం బ్యానర్ అన్నపూర్ణ క్రియేషన్స్ లో నిర్మించిన ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణని దర్శకుడిగా పరిచయం చేసాడు. మొదటిసారి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పట్ల సంతృప్తి లేక రీ షూట్ చేయించాడు నాగ్.  మరి ‘‘వాసి వాడి తస్సాదియ్యా’’ అంటూ నాగ్ చేసిన మాయాజాలం ఏమేర వర్కవుట్ అయ్యిందో తెలియాలంటే చలో రివ్యూ...

కథ :

గోదావరి జిల్లాలోని శివాపురానికి సోగ్గాడు బంగార్రాజు(నాగార్జున). అమ్మాయిలని మాటలతోనే మత్తులో పడేసే మొనగాడు. నవ్వుతూ... నవ్విస్తూ ఉండే బంగార్రాజు అంటే ఊర్లో అందరికీ ప్రేమే. అలాంటి వ్యక్తి ఓ రోజు సడన్ గా యాక్సిడెంట్ లో బంగార్రాజు చనిపోతాడు.

కట్ చేస్తే... బంగార్రాజు భార్య అయిన సత్యభామ(రమ్యకృష్ణ) బంగార్రాజు లా(జల్సా పురుషుడిగా) తన కొడుకు రామ్మోహన్(నాగార్జున) పెరగ కూడదని ఊరికి దూరంగా డాక్టర్ చదివిస్తుంది. సీత(లావణ్య త్రిపాటి) అనే యువతితో పెళ్లి కూడా చేస్తుంది. ఇద్దరు అమెరికా వెళ్లిపోతారు. అలా మూడేళ్లు గడుస్తుంది. అయితే పనే లోకంగా భావించే భర్తతో విడాకులు తీసుకోవాలని సీత నిర్ణయించుకుంటుంది.  ఆ  క్రమంలో ఇద్దరు శివపురంకి వస్తారు.

విడాకుల విషయం విన్న సత్యభామ బంగార్రాజు ఫోటో ముందు తన మొర చెప్పుకుంటుండగా.. పైన యమలోకంలో యముడు(నాగబాబు) ఆ పతివ్రత కోరిక తీర్చాలని అసలు ఎప్పుడూ జరగని రీతిలో యముడు బంగార్రాజు ఆత్మని భూమి మీదకి పంపుతూ, సత్యభామకి మాత్రమే కనిపించే, వినిపించే వరం కూడా ఇస్తాడు. అలా వచ్చిన బంగార్రాజు విడిపోవాలి అనుకున్న రామ్ మోహన్ – సీతలని ఎలా కలిపాడు? ఈ టైంలో బంగార్రాజు తన చావు గురించి తెలుసుకున్న నిజాలేమిటి?

ఫ్లస్ పాయింట్లు:

నాగార్జున బంగార్రాజు, రామ్మోహన్ అలియాస్ రాము అనే రెండు విభిన్న పాత్రల్లో అద్భుతమైన నటనని కనబరిచాడు. ఈ రెండు పాత్రలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఆ రెండు పాత్రల్లో నాగ్ చూపిన వైవిధ్యం సూపర్బ్. అంతేకాదు మనకు ఓ సారి ‘హలో బ్రదర్’ సినిమాలోని పాత్రలని గుర్తు చేస్తుంది. బంగార్రాజు పాత్రలో ఆడవారితో తెగ మాటలు కలిపి, ఇట్టే తన వశం చేసుకునే అల్లరి సోగ్గాడి పాత్రలో చాలా బాగా చేసాడు. అంతేకాక బంగార్రాజు పాత్రలో కోనసీమ యాసలో డైలాగ్స్ అదరగొట్టేసాడు. ఇక రాముగా అమాయకమైన పాత్రలో పెదవులపై కంటిన్యూగా నవ్వును జెనరేట్ చేస్తూ ఉంటాడు. ఈ వయసులోనూ నాగ్ లో ఆ చరిష్మా తగ్గలేదు. ఆ మెయిన్టైనెన్స్ కి హ్యాట్సాఫ్.

                 రమ్యకృష్ణ తన పాత్రలో ది బెస్ట్ అనిపించుకుంది. ఇప్పుడు కూడా నాగ్ – రమ్యకృష్ణల పెయిర్ చూడ ముచ్చటగా ఉంది.  లావణ్య త్రిపాటి హోమ్లీ లుక్ లో చాలా అందంగా కనిపించడమే కాకుండా తన సింపుల్ క్యూట్ లుక్స్, హావ భావాలతో ఓ మంచి ఫీల్ ని కలిగించింది. ఇక సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయిన ముద్దు గుమ్మలు అనసూయ, హంసా నందిని, దీక్ష పంత్ లు ఉన్న సీన్స్ లో మస్త్ అనిపించారు. హైలెట్ ఏంటంటే... అనుష్క సడన్ గెస్ట్ రోల్. యముడిగా నాగబాబు, విలన్లుగా సంపత్ రాజ్, నాజర్ తదితరులు వారి వారి పాత్రల్లో మెరిశారు.

పిఎస్ వినోద్ – సిద్దార్థ్ లు కలిసి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. ప్రతి సీన్ అందంగా క్యూట్ గా ఉంటుంది, ఆ సీన్స్ ని తన విజువల్స్ తో ఒక అందమైన అనుభూతిగా మార్చేశాడు. ఇక అనూప్ రూబెన్స్ అందించిన మెలోడీస్ సూపర్బ్ అయితే ఆ పాటలని ఎక్కువభాగం సీన్స్ తో షూట్ చేసిన విధానం సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్. అలాగే నేపధ్య సంగీతం సినిమాకి మరో ప్రధాన హైలైట్. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ డిజైన్ చేసిన సెట్స్, విలేజ్ హౌస్ మరియు యమలోకం సెట్ చాలా బాగున్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఉన్న బడ్జెట్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్లు :

ఫస్ట్ హాఫ్ మొత్తంలో కథలోకి ఎంటర్ అవ్వకుండా కేవలం సినిమాలోని పాత్రలని, ఆ పాత్రల స్వభావాలని మాత్రమే చెప్తూ ఫస్ట్ హాఫ్ ని ఫినిష్ చేస్తారు. దానివలన చూసే ఆడియన్స్ కి సీన్స్ వల్ల మంచి ఫీలున్నా ఇంటర్వెల్ టైంకి ఇంతసేపు అసలు కథలోనే ఎంటర్ అవ్వలేదేంటి అనే భావనకి లోనవుతారు. దానివలన కొంతమంది ఆ లవ్ సీన్స్ ఒక స్టేజ్ తర్వాత బోర్ కొట్టవచ్చు. కథలో ఉన్న కంటెంట్ మరియు ఒక్కగానొక్క ట్విస్ట్ ని సెకండాఫ్ చివరి 30 నిమిషాల్లో చెప్పడం. ఆ కారణంగా సెకండాఫ్ మొదటి 30 నిమిషాలలో పెద్ద కిక్ ఉండదు.

సినిమాలో ఉన్న మేజర్ ట్విస్ట్ ఒక్కటే.. ఆ ఒక్క ట్విస్ట్ ని ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా రాసుకోలేకపోయారు. అలాగే ఆ ట్విస్ట్ రివీల్ అవ్వగానే సినిమా ఏంటనేది అందరికీ తెలిసిపోతుంది. అలాగే సూపర్ నాచురల్ పవర్స్ ని వాడుకొని రాసుకున్న ప్రీ క్లైమాక్స్ సీన్ ఇంకాస్త బాగుండాల్సింది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే ఎఫ్ఫెక్టివ్ గా లేకపోవడం వలన చాలా చోట్ల బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే లీడ్ పెయిర్ మధ్య లవ్ ట్రాక్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. రామ్ మోహన్ ఇచ్చిన సింపుల్ స్టొరీ లైన్ ని కళ్యాణ్ కృష్ణ చాలా బాగా డెవలప్ చేసుకున్నాడని చెప్పాలి. ఆ కథని స్క్రీన్ ప్లే లో ప్రెజంట్ చేస్తున్నప్పుడు సత్యానంద్ కాస్త బెటర్ మెంట్ చేయాల్సింది కానీ చేయలేదు. ఎలా అంటే సినిమాలో ఉన్నదే ఒక్క ట్విస్ట్.. అలాంటప్పుడు స్క్రీన్ ప్లేలో సాగదీత సీన్స్ లేకుండా చూడాల్సింది. కానీ అయన ఆ పని చేయలేదు అందుకే కొంత బోరింగ్ గా ఉంటుంది.

చివరగా :

మొదటి నుంచీ అందరూ అనుకుంటూ వచ్చినట్టుగానే… ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో ఇప్పుడు మనం మన ఫ్యామిలీలో మిస్ అఅవుతున్న ఫీలింగ్స్ ని చూపిస్తూ ఉండడం వలన చూసే ఆడియన్స్ పెదవులపై చిరునవ్వు ఎక్కడా మిస్ అవ్వదు. అంతలా కథకు కనెక్ట్ అయిపోతారు. కళ్యాణ్ కృష్ణ కథను డెవలప్ చేసుకున్న తీరు, సంభాషణలు బాగా ఆకట్టుకుంటాయి. ఎక్కడా అతి కాకుండా సినిమా ట్రాక్ ను బాగా నడిపించాడు. వెరసి మనం తర్వాత ఓ డీసెంట్ చిత్రంతో నాగ్ మన ముందుకు వచ్చాడనే చెపొచ్చు. పెద్ద సినిమాలకు పోటీగా అసలు నాగ్ రిస్క్ చేస్తున్నాడా అనుకున్న టైంలో చూశాక నాగ్ కరెక్ట్ పనే చేశాడు అనిపించక మానదు.

ఫైనల్ గా... సంక్రాంతి సీజన్ లో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు