నటీనటులు : సాయిధరమ్ తేజ్, రెజీన, బ్రహ్మానందం, అజయ్, నాగబాబు, సుమన్ తదితరులు
సాంకేతిక వర్గం :
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్ , సంగీతం : మిక్కీ జే మేయర్, నిర్మాత : ‘దిల్’ రాజు, దర్శకత్వం : హరీష్ శంకర్
యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ తొలి చిత్రం రేయ్ అయినప్పటికీ విడుదలైంది మాత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’. ఆ సినిమాతో మొదటి చిత్రమే హిట్ అయ్యింది. రేయ్ ఫలితాన్ని పక్కనబెడితే ఇప్పుడు మూడో చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో ఈ గురువారం (సెప్టెంబర్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి హిట్ లో భాగస్వామి అయిన హీరోయిన్ రెజీనా నే ఇందులోనూ నాయికగా నటించింది. గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ దిల్ రాజు నిర్మాత. మరి ఇన్ని హంగులతో వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఏం రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం...
కథ :
డాలర్ వేటలో ఏ పనిపడితే ఆ పని చేసుకుంటూ పోయే కుర్రాడు సుబ్రహ్మణ్యం. డబ్బు కోసం తనను తాను అమ్ముకోవటానికి కూడా వెనకాడడు. ఇలా జేబులు నింపుకుంటూ జీవితం కొనసాగిస్తుంటాడు. అలాంటి సుబ్బు లైఫ్ లోకి సడన్ గా ఎంటర్ అవుతుంది మన హీరోయిన్ సీత (రెజీన కసాండ్ర). ఇంట్లో నుంచి లేచిపోయి రావటం, ప్రేమించినవాడు మోసం చెయ్యటంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో సుబ్బు తనకు అండగా నిలుస్తాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఇలా ఉండగా సీత చెల్లెలు గీత(తేజస్వి) కి పెళ్లి కుదరటంతో సుబ్రహ్మణ్యంతో కలిసి ఇండియాకు వస్తుంది సీత. అప్పుడే అక్కడ సుబ్రహ్మణ్యంకి అనుకోని రెండు చిక్కులు ఎదురవుతాయి. వారే బియ్యం బుజ్జి(రావు రమేష్) మరియు గోవింద్ గౌడ్(అజయ్)ఎంటర్ అవుతారు. వీరిద్దరికీ ఏం సంబంధం లేకపోయినా కేవలం సుబ్రహ్మణ్యం వారు కొట్టుకుంటారు. బుజ్జి సుబ్బును చంపాలనుకుంటే, గోవింద్ మాత్రం తన చెల్లెలు దుర్గ(ఆద శర్మ)ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. మరి ఆ సమస్యలను దాటి సీతను సుబ్బు ఎలా ఛేజిక్కించుకున్నాడు అన్నదే కథ.
ఫ్లస్ పాయింట్లు:
తనని తానూ అమ్ముకోవాలి అనే ఢిపరెంట్ కాన్సెప్ట్ తో హీరో క్యారెక్టరైజేషన్ ను సృష్టించిన హరీష్ కి హట్సాఫ్ చెప్పాలి. అదంతా ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ను ఇవ్వటమే కాకుండా ఎంటర్ టైన్ గా సాగిపోతూ ఉంటుంది. కమెడియన్స్ తో ఎక్కువ పని లేకుండా కేవలం హీరోతోనే లాగించేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆద్యంతం మిమ్మల్ని నవ్విస్తూ, శరవేగంగా సాగిపోతుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే సాయిధరమ్ తేజ్ కి ఇది మూడవ సినిమా. స్క్రీన్ ప్రెజెంటేషన్ (లుక్ అండ్ స్టైలింగ్)కి బాగున్నాడు. హరీష్ లాంటి మాస్ డైరక్టర్ చేతిలో పడటం మూలానా డైలాగ్ డెలివరీలోనూ ఇంప్రూవ్ మెంట్ చూపించాడు. అయితే సెంటిమెంట్ నటనలో కాస్త రాటుదేలాల్సి ఉంది. డాన్సులు ఇరగదీసాడు. ఇక రెజీన వంతు వచ్చేసరికి చాలా రోజుల తర్వాత క్యారెక్టర్ రోల్ చేసినట్లు అనిపిస్తుంది. ఎమోషనల్ గా ఆమె చేసిన నటన హైలెట్. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో ఇద్దరి కెమిస్ట్రీ అదిరింది. బ్రహ్మానందం ఫస్ట్ హాఫ్ లో కాసేపు సెకండాఫ్ లో కాసేపు బాగా నవ్వించాడు. ఇక రావు రమేష్, సుమన్, అజయ్, ఫిష్ వెంకట్, నరేష్, ఝాన్సీ, రణధీర్, తేజస్వి తదితరులు తమ చిన్న చిన్న పాత్రలలో ఓకే అనిపించుకున్నారు. ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్ లో ఆడియన్స్ కి ఓ మంచి ఫీల్ ని ఇచ్చి బయటకి పంపిస్తాయి.
ముందుగా సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అదుర్స్. ముఖ్యంగా యూఎస్ లో లొకేషన్లను అద్భుతంగా చూపించాడు. మిక్కీ జే మేయర్ అందించిన నేపధ్య సంగీతం సూపర్బ్. మెలోడీలు అందించే మిక్కీయేనా ఇలాంటి మ్యూజిక్ ఇచ్చింది అన్న అనుమానం కలుగుతుంది. హీరోయిజం ఎలివేట్ చేసే టైంలో మ్యూజిక్ గ్రాండ్ గా ఉంటుంది.
మైనస్ పాయింట్లు :
నెగటివ్ పాయింట్స్ అనే విషయానికి వస్తే హరీష్ శంకర్ తన ప్రతి సినిమాలోనూ ఎక్కువ భాగం చేసిన తప్పు కథా పరంగా సూపర్బ్ స్టార్ట్ ఇస్తాడు, కానీ సూపర్బ్ అనేలా ఎండ్ చెయ్యడం చాలా చాలా తక్కువ. ఇందులోనూ ఆలాంటిదే జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పటికే చూసేసిన పాత కథ. దానిని బాగానే ప్రెజంట్ చేస్తూ వచ్చి క్లైమాక్స్ ని మరీ ఊహాజనితంగా మార్చేశాడు. ఎలా అంటే సెకండాఫ్ మొదలైన 10 నిమిషాలకే కథకి ముగింపు ఏంటనేది అర్థమైపోతుంది. కొన్ని సీన్స్ బాగున్నా, కొన్ని కొన్ని బోర్ కొట్టడం, సాగ దీస్తున్నారు అనే ఫీలింగ్ వలన ఆడియన్స్ మదిలోకి ఊహించదగిన రెగ్యులర్ ముగింపే కదా అనే భావన కలుగుతూ ఉంటుంది. కావున కథ – కథనం విషయంలో సెకండాఫ్ ని ఇంకాస్త క్రేజీగా రాసుకొని ఉండాల్సింది.
కథ, కథలో పాత్రలు కొత్తవి, కానీ ఇన్నర్ గా నడిచే కథ పాతదే, ఇంచు మించు మనం ఇంతకముందు చూసిందే. కథనం ముగ్గురు కలిసి రాసిన ఈ కథనం ఫస్ట్ హాఫ్ పరంగా కేక అయితే సెకండాఫ్ పరంగా ఓకే.
చివరగా :
తెలుగు ప్రేక్షకులు కోరుకునే రొమాన్స్, కామెడీ, యాక్షన్ లతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని సమపాళ్ళలో మిక్స్ చేసి మన ముందుకు తీసుకువచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా ఈ సీజన్ లో వచ్చిన పర్ఫెక్ట్ కమర్షియల్ బాక్స్ ఆఫీస్ సేల్. సాయిధరమ్ తేజ్ కెరీర్లో మూడవ సినిమాగా, సుప్రీం హీరో అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కూడా తనకి స్ట్రాంగ్ కలెక్షన్స్ తెచ్చిపెడుతుంది. హరీష్ శంకర్ పాత కథని కొత్తరకమైన హీరో పాత్రతో ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా చెప్పడమే ఆడియన్స్ ని మెప్పించే విషయం. కుటుంబ విలువలతో పాటు, కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి చేసిన సినిమా ఇది.
చివరగా... పాత కథ... కొత్త కథనం. వెరసి కమర్షియల్ హంగులున్న సుబ్రహ్మణ్యం బాగానే అలరిస్తాడు.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment