నటీనటులు : ప్రి న్స్, జ్యోతిసేథ్, జయప్రకాష్ రెడ్డి, రావు రమేష్, సప్తగిరి, తాగుబోతు రమేష్, సంపూర్ణేష్ బాబు, మధునందన్ తదితరులు
సాంకేతిక వర్గం :
కెమెరా: చిట్టిబాబు, ఎడిటింగ్: మధు, సంగీతం: కమ్రాన్, నిర్మాతలు: వేణుగోపాల్ రెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి, ఆలూరి చిరంజీవి, దర్శకత్వం: శ‌్రీనివాస్ రాగ
మరుగుదొడ్ల ప్రచారానికి సంబంధించిగానీ, పద్మశ్రీ అందుకున్న తర్వాతగానీ, డర్టీ పిక్చర్ తర్వాతగానీ విద్యాబాలన్ పేరుకు మంచి రెప్యుటేషన్ ఉంది. ఆ మధ్య ఓ సినిమాలో బ్రహ్మానందానికి కూడా విద్యాబాలన్ అనే పేరు పెట్టారు.అంటే ఆ పేరుకు ఎంత రీచ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వేర్ ఈజ్ విద్యాబాలన్? అని సినిమా పేరును ప్రకటించగానే ఇదేదో కామెడీ సినిమా అని అందరికీ అనిపించింది. అందరూ సస్పెక్ట్ చేసింది నిజమే. ఈ సినిమా కామెడీ సినిమానే. కాకపోతే సస్పెన్స్ కూడా కీలకంగా సాగుతుంది. ప్రిన్స్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో, ఏమిటో ఓ సారి చదవండి...
కథ :
కిరణ్ (ప్రిన్స్)పిజ్జా కార్నర్ లో పనిచేస్తుంటాడు. మధ్య తరగతికి చెందిన యువకుడు ఇతడు. అయినా కుటుంబసభ్యులతో కలిసి ఉండడు. తనకు నచ్చినట్టు బతకాలనే ఫార్ములాతో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. స్వాతి (జ్యోతిసేథ్)ను చూసి ప్రేమిస్తాడు. ఆమె డాక్టర్. ఆమెకి ఇతనంటే నచ్చదు. దాంతో తన బావ వాల్తేరు వాసు (మదునందన్)కు చెబుతుంది. అతను ఎలాగోలా వీరిద్దరికి మధ్య దూరం పెంచగలుగుతాడు. అదే సమయంలో జ్యోతి పనిచేసిన అదే ఆసుపత్రిలో పనిచేసే ఇంకో డాక్టర్ (రావు రమేష్) మినిస్టర్ పులినాయుడు (జయప్రకాష్‌రెడ్డి)కి ఓ వీడియో మెసేజ్ పంపుతాడు. రూ.10కోట్లు డబ్బు తీసుకుని రాకపోతే ఆ మెసేజ్‌ను స్ప్రెడ్ చేస్తాననీ బయపెడుతాడు. దాంతో పులినాయుడు ఆగమేఘాల మీద వస్తుంటాడు. డబ్బు తీసుకోబోయిన డాక్టర్‌ను ఇంకొకరు చంపుతారు. అదే సమయంలో డాక్టర్ చేతిలో ఉన్న ఫోన్ మిస్ అవుతుంది. ఆ మర్డర్ చేసింది కిరణ్, వాల్తేరు వాసు అని అందరూ అనుకుంటారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌కు నీలకంఠ (ఆశిష్ విద్యార్థి) వస్తాడు. అతని పరిశోధనలో ఏం బయటపడింది?
ఇంతకీ కిరణ్‌ని స్వాతి ప్రేమించిందా ? లేదా? వాల్తేరు వాసు పరిస్థితి ఏంటి? పులినాయుడు అంతగా భయపడటానికి ఆ వీడియోలో ఏముంది? డాక్టర్ ని చంపింది ఎవరు? డాక్టర్ చేతిలో ఉన్న ఫోన్ ఎవరి చేతికి దక్కింది? కిరణ్, వాసు నిర్దోషులని ఎలా నిరూపించుకోగలగిగారు. పులినాయుడు పక్కనున్న గంటా ఏం చేశాడు? వంటివన్నీ ఆసక్తికరమే. ఒకదానితో ఒకటి లింకేసుకుని ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వేర్ ఈజ్ విద్యాబాలన్ చూడాల్సిందే. ఇంతకీ విద్యాబాలన్ ఎవరు? అనే విషయం కూడా సినిమా మొత్తం పూర్తయితే గానీ అర్థం కాదు.
ఫ్లస్ పాయింట్లు:
ఒడ్డూ పొడుగుతో చూడ్డానికి బావుంటాడు ప్రిన్స్. పెద్దగా డ్యాన్సులు, ఫైట్లు అవసరం లేని ఇలాంటి స్క్రిప్టులకు చక్కగా సరిపోతాడు. బస్టాప్, రొమాన్స్ సినిమాలతో హిట్‌లను సొంతం చేసుకున్న ప్రిన్స్ కు ఇది యావరేజ్ సినిమా అవుతుంది. ఈ సినిమాలో తన పరిధి మేర బాగా చేశాడు. కొత్తమ్మాయి జ్యోతి గ్లామర్‌కు ఎక్కడా వెనకాడలేదు. రాయలసీమ యాసలో జయప్రకాష్‌రెడ్డి అదరగొట్టారు. సంపూర్ణేష్ బాబును ఈ సినిమాలో చూసిన వారు అతని గత సినిమాల్లో కనిపించిన ఓవరాక్షన్ ఏమైందా? అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ సినిమాలో అంత బాగా నటించాడు సంపూ. సప్తగిరి, తాగుబోతు రమేష్ తనకిచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారు. కడుపుబ్బ నవ్వించారు. శ్రీనివాస్ రాగ తనదైన స్టైల్ ని కంటిన్యూ చేస్తూనే మెప్పించాడు. కమ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ సంగీతం బావుంది. సినిమాకు కావాల్సిన ఊపును తెచ్చిపెట్టింది.
మైనస్ పాయింట్లు :
కథ బాగానే ఉంది. కానీ కథనంలో వేగం తగ్గింది. ఇలాంటి స్క్రిప్టులను ఇంకా గ్రిప్పింగ్‌గా చెప్పడానికి ప్రయత్నించాలి. కాసేపు పరిగెత్తించి, కాసేపు డీలా పడేలా చేస్తే గ్రాఫ్ మెయింటెయిన్ కాదు. అలాగే సినిమా పూర్తయిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద పెట్టిన దృష్టిని కమ్రాన్ ఎందుకో ఈ సినిమా మొదట్లో ట్యూన్ల మీద పెట్టలేదనిపిస్తుంది. పాటలు పేలవంగా ఉన్నాయి. నిజానికి ఏదో కమర్షియాలిటీకి తప్ప సినిమాలో పాటలు అవసరం కూడా లేదు. మరీ రొమాంటిక్ సాంగ్, ఐటమ్ సాంగ్ కావాలని తెచ్చి ఇరికించినట్టు అనిపిస్తాయి. సినిమా స్లో కావడానికి అవి రెండూ ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. ఎడిటర్ నిర్మొహమాటంగా వాటికి కత్తెరేస్తే బావుండేది.
చివరగా :
కొన్ని విషయాలు అక్కడిక్కడ బాగానే అనిపిస్తాయి. నెమరేసుకునేంత గొప్పగా ఉండవు. వేర్ ఈజ్ విద్యాబాలన్ పరిస్థితి కూడా అంతే. సినిమా చూసినంత సేపు బాగానే ఉన్నట్టుంటుంది. కానీ రిపీటెడ్‌గా చూసేయాల్సిన సినిమా ఏం కాదు. శ్రీనివాస్ రాగ తనదైన శైలితో తెరకెక్కించారు. కామెడీ డైలాగులను బాగానే రాసుకున్నారు. ఒకసారి అలా పొద్దుపోవడం కోసం చూడొచ్చు.
బాటమ్ లైన్: సస్పెన్స్ కామెడీ విద్యాబాలన్!
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment