చిన్నారులకు సంబంధించిన కథనాలను అందించిన తెలుగు టీవీ ఛానెళ్లకు యూనిసెఫ్ అవార్డులు అందించింది. వీటిలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఓ అవార్డును దక్కించుకుంది. మంగళవారం రాత్రి బంజారాహిల్స్ లోని తాజ్‌డెక్కన్‌లో 11 విభాగాల్లో అవార్డులను అందించారు. 'చిన్నారుల విద్య' అనే విభాగంలో ఈటీవీ 'బాలబడి' అవార్డు పొందింది. తూర్పుగోదావరి జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో ఏర్పాటైన చిన్నారుల సంరక్షణ కేంద్రాలపై 'బాలబడి' పేరుతో ఈటీవీ ప్రచురించిన ప్రత్యేక కథనం యూనిసెఫ్ అవార్డుకు ఎంపికైంది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాజీ ఐఏఎస్, జ్యూరీ ఛైర్‌పర్సన్ పి.వి.ఆర్.కె. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక యూనిసెఫ్ ప్రతినిధి రుథ్ లియానో, సీఎంఎస్ డైరెక్టర్ పి.ఎన్.వాసంతిలు జ్ఞాపికలు అందజేశారు. ఈటీవీ తరఫున బ్యూరో చీఫ్ నారాయణ జ్ఞాపికను అందుకున్నారు. ఈటీవీ 'సుఖీభవ'లో ప్రసారమైన 'పిల్లలు అస్వస్థత', బాలలపై చర్చ విభాగంలో 'ప్రాథమిక విద్య స్థితిగతులు' అంశాలపై రూపొందించిన కథనాలు తుది పోటీ వరకు చేరాయి. ఎక్కువ సమయం పిల్లల కోసం కేటాయించిన ఛానెళ్లలో మూడు, నాలుగు స్థానాల్లో ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌లు నిలిచాయి.