హుధూధ్ బాధితులకోసం సినీ పరిశ్రమ తలపెట్టిన ’మేముసైతం’ కార్యక్రమం ద్వారా సేకరించిన రూ. 11 కోట్ల 51 లక్షల 56 వేలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. కార్యక్రమంలో చివర్లో హాజరైన సీఎం చంద్రబాబునాయుడు, విశాఖను ఆదుకునేందుకు ముందుకొచ్చిన సినీ కళాకారులు ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఇదే స్ఫూర్తితో విశాఖను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ మొత్తంతో హుధుద్ తుఫాన్‌తో దెబ్బతిన్న ఓ ప్రాంతాన్నిగానీ, ఒక పల్లెని మీరే ఎంచుకుని దాన్ని ‘స్మార్ట్ విలేజ్’గా తీర్చిదిద్దాలని కోరారు. వచ్చే అక్టోబర్‌కి తుఫాన్ వచ్చి ఏడాది పూర్తవుతుందని, ఆలోగా ఆ విలేజ్‌ని పూర్తి చేయాలని సూచించారు. ఈ విరాళాలతో దాదాపు 8 వేల గృహాలను కట్టవచ్చని, తెలుగు సినీ పరిశ్రమ పేరు కలకాలం నిలిచిపోయేలా ఆ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో ఏ విలయం కూడా ఏమీ చేయలేనంత గొప్పగా వైజాగ్‌ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. తెలుగువారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని, రెండు రాష్ట్రాల్లోనూ చిత్రసీమ అభివృద్ధి చెందాలని ఆశించారు.