లక్ష్మీ పార్వతి తన భర్త ఎన్టీఆర్ మరణంపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయమై తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి స్పందిస్తూ ‘ఎన్టీఆర్ గుండె చాలా గట్టిది. గతంలో మేం తిరుగుబాటు చేసినప్పుడు ఆయనకు ఏమీ కాలేదు. ఆ తర్వాతే ఆయన జీవితం ముగిసింది. లక్ష్మీపార్వతి ఆయన జీవితంలో ప్రవేశించిన తరువాత జరిగిన ఘటనలపై విచారణ జరిపించాలి. ఎన్టీఆర్ కు ఇచ్చిన మందులు... ఆహారం మొదలు... కుటుంబ సభ్యులను దగ్గరకు రానివ్వకపోవడం వరకూ అన్ని అంశాలపై విచారణ జరగాలి’’ అని డిమాండ్ చేశారు. లక్ష్మీపార్వతి లేఖ ఎన్టీఆర్ గౌరవాన్ని తగ్గించేలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే నన్నపనేని రాజకుమారి మాటలకు లక్ష్మీ పార్వతి స్పందిస్తూ ఎన్టీఆర్ మరణంపై టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణంపై డాక్టర్ ఇచ్చిన నివేదిక కూడా ఉందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఎన్టీ ఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాననీ, తానెప్పుడూ ఏ పదవీ ఆశించలేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే బహిరంగంగానే అగ్ని ప్రవేశం చేస్తానని అన్నారు.