తెలంగాణ బస్సులపై ఏపీ ప్రజల మమకారం

November 03, 2015 | 11:07 AM | 9 Views
ప్రింట్ కామెంట్
APSRTC_TSRTC_ticket_price_difference_war_niharonline

విభజనలో అత్యంత కీలకంగా భావించిన రవాణా వ్యవస్థ ఆర్టీసీని ఇరు ప్రభుత్వాలు నాటకీయ పద్ధతిలో విభజించాయి. అదయ్యాక అక్కడా, ఇక్కడా సిబ్బంది సమ్మె చేయటం, వారి వారి డిమాండ్లను సాధించుకోవటం మనకు తెలిసిందే. తదనంతరం అప్పులో కూరుకుపోయిన ఆర్టీసీని బతికించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఛార్జీలు పెంచక తప్పలేదు. కానీ ఇప్పుడది కాస్త ఏపీ ఆర్టీసీకి శాపం అవుతోంది. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఉన్న రాష్ట్రానికి మరో దెబ్బగా మారే అవకాశంగా మారింది.

తాజాగా ఓ యువకుడికి ఎదురైన అనుభవాన్ని ఇక్కడి చదవండి. అతను కర్నూలు నుంచి హైదరాబాద్ కి వస్తున్నాడు. జడ్చర్ల డిపోకు చెందిన హైదరాబాద్ వెళ్లే బస్సు ప్లాట్ ఫాంపైకి వస్తోంది. ఇంతలో కర్నూలు డిపో కండక్టర్లు దాన్ని అడ్డుకున్నారు. తమ డిపోకి చెందిన మూడు బస్సులు వరుసలో ఉన్నాయి, అవి వెళ్లాకే నీ బస్సు కదలాలి అని డ్రైవర్ ని బెదిరించారు.  అయితే తమ బస్సు బయలుదేరాల్సిన టైమందని జడ్చర్ల డిపో బస్సు కండక్టర్ వారితో వాదించాడు. ఇంతలో అక్కడున్న ప్రయాణికులంతా తోసుకుంటూ వచ్చి జడ్చర్ల డిపో బస్సు ఎక్కేశారు. ఇది ఒక్క కర్నూలు బస్టాండులో మాత్రమే కాదు దాదాపు ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. తమ రాష్ట్రానికి చెందిన డిపో బస్సులు వదిలి, పక్క రాష్ట్రం బస్సులు ఎక్కడానికి కారణమేంటి అసలు?

విషయం ఏమంటే... ఛార్జీలు పెంచింది కేవలం ఏపీ సర్కారే కావటం. కార్మికుల డిమాండ్లను పరిష్కరించటంతోపాటు తెలంగాణ ప్రభుత్వం చార్జీల జోలికి పోలేదు. దీంతో ఒకే రూట్లో ప్రయాణిస్తున్న తెలంగాణ, ఏపీ బస్సుల మధ్య టికెట్ ధరల్లో వ్యత్యాసం వచ్చింది. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ధరలు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. సొంత బస్సుల కంటే పక్క బస్సులే ముద్దు అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. మరోవైపు వివిధ డిపోల నుంచి ముందస్తు రిజర్వేషన్ల విషయంలోనూ తెలంగాణ డిపోల బస్సులకు ఆదరణ పెరిగి, ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా మెరుగుపడింది. దీంతో తమ ఆదాయానికి గండి పడుతుందని ఏపీ ఆర్టీసీ అధికారులు ఆందోళనపడుతున్నారు. తెలంగాణలోనూ ఛార్జీలు పెంచాలని ఏపీ నుంచి ఒత్తిడి వస్తుందట. ఒకవేళ అది కుదరకపోతే అంతరాష్ట్ర ఒప్పందం అయినా చేసుకోవాలని వారు టీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ