కల్తీ మద్యం కారణంగా ఆంద్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడలో సోమవారం ఉదయం ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కృష్ణలంకలోని స్వర్ణ బార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, టీడీపీ సీనియర్ నేత, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆరోపణలను ఆధారంగా చేసుకుని ఆ బార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కి చెందినదిగా ఉదయం నుంచి మీడియాలో ప్రచారం అవుతుంది.
హడావుడిగా మీడియా ముందుకు వచ్చిన మల్లాది ఆ బార్ తనది కాదని, తన బంధువులదని ప్రకటించారు. అంతేకాదు ఘటనకు కల్తీ మద్యం అసలు కారణం కాదని ఆయన చెబుతున్నారు. బార్ లో ఉండే వాటర్ కూలర్ లో ఏదో కలియటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుందని అంటున్నారు. మినరల్ వాటర్ లో మద్యం కలుపుకున్న వారికి ఏం కాలేదని, బార్ లోని కూలర్ వాటర్ తో కలుపుకుని తాగిన వారి పరిస్థితే ఇలా అయ్యిందని చెప్పారు. సీసీ పుటేజ్ ల ఆధారంగా దుండగులను గుర్తించాలని పోలీసులను ఆయన కోరారు. మరోవైపు కుట్రలో ఏమైనా రాజకీయ కోణం కూడా దాగి ఉందా కనిపెట్టాల్సిందిగా పోలీసులను ఆయన కోరుతున్నారు.