తిరుమల వెంకన్న సన్నిధిలో ఇకపై కొసరి కొసరి వడ్డింపులు బంద్ కానుంది. నిత్య అన్నదానం ఇకపై బఫే పద్ధతిలో అమలు కానుంది. అన్నదానం కోసం తిరుమలలో నిర్మించిన తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద సముదాయంలో ఇప్పటిదాకా వరుస క్రమంలో కూర్చునే భక్తులకు టీటీడీ నియమించిన సిబ్బంది అన్నదానం (వడ్డింపు) చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానానికి బదులుగా బఫే (స్వయంగా వడ్డించుకునే) పద్ధతి అయితే బాగుంటుందని టీటీడీ ఈఓ సాంబశివరావు భావించారు.
భక్తులు వేచి ఉండే అవసరం లేకపోవడంతో పాటు, త్వరగా అన్నప్రసాదం ముగియడం, అన్న ప్రసాదాల వృథా కూడా తగ్గుతుందన్న భావనతోనే ఈ కొత్త విధానం బాగుంటుందని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న బఫే పద్ధతి అన్న ప్రసాద పంపిణీని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వారం పాటు ఈ విధానాన్ని పరిశీలించి, తదుపరి ఈ విధానాన్ని కొనసాగించాలా? లేక పాత ‘వడ్డింపు’ పద్ధతినే అవలంబించాలా? అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారట.