వీర మరణాలపై రోజుకో కథ బయటకు వస్తున్నాయి. నేతాజీ, లాల్ బహదూర్ శాస్త్రి, భగత్ సింగ్ ఇలా అందరి మరణాలపై నెలకొన్న సస్పెన్స్ కొనసాగుతుండగానే మరో అంశం వెలుగులోకి వచ్చింది. తాజాగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరణంపై కథనాలు వినిపిస్తున్నాయి. పోరాడితేనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మిన గిరిజన ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు. బ్రిటీష్ వారి తుపాకులకు 1924, మే 7న మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది చరిత్రలో మనం చదువుతున్నది. కానీ, ఆయన మరణం వెనుక కూడా నేతాజీ తరహాలోనే ట్విస్ట్ వుందని తెలుస్తోంది. సీతారామరాజు అనుచరుడు ఉప్పరపల్లి వీర వెంకటాచారిని కాల్చి చంపిన తెల్ల దొరలు, ఆయనే సీతారామరాజని పొరపాటు పడ్డారని పలువురు నమ్ముతున్నారు. ఆపై పోరాటాన్ని వదిలి తూర్పు గోదావరి జిల్లాలోని బెండపూడిలో శ్రీ పరమహంస చిద్వెంకట రామ బ్రహ్మానంద మహర్షి అలియాస్ బెండపూడి సాధు పేరిట సీతారామరాజు ఎంతో కాలం బతికారని కొందరు వాదిస్తున్నారు.
బెండపూడి సాధు ఆశ్రమంలో రోజు ఒక్క పూట వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారట. అంతే కాదు ఆయనగారికి తొమ్మిది మంది భార్యలు ఉండేవారట. ఆయన కదలికలపై అనుమానం వచ్చిన తునీ పోలీసులు 1967 ప్రాంతంలో దొంగనోట్ల కేసులో ఆయన్ని విచారించారట కూడా. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో ఆయన్ను వదలేశారని టాక్. కావాలంటే, ఆయన దంతాలు, తల వెంట్రుకల డీఎన్ఏలతో అల్లూరి వారసుల డీఎన్ఏను పోల్చి చూడాలని, అల్లూరి మరణం వెనుక అసలు నిజాన్ని బయట పెట్టాలని జన్యు శాస్త్ర విద్యార్థి నాగ సింహాద్రి డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ అధికారులు ఇటీవల బెండపూడిని సందర్శించి వివరాలు సేకరించారు. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం శాంపిళ్లను సీసీఎంబీకి పంపవచ్చా? అన్న విషయమై న్యాయ సలహాలు కోరారు. కాగా, అల్లూరి సీతారామరాజు తన 27వ ఏట మరణించారని చరిత్ర చెబుతుండగా, బెండపూడి సాధు 1968లో తనువు చాలించారు. ఆ సాధు మరణించిన తర్వాత రెండు రోజుల దాకా తిరిగి బతుకుతారనే నమ్మకంతో జనాలు డెడ్ బాడీని అలానే ఉంచారట. చివరికి పోలీసుల జోక్యంతో శవానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు కథనం. ఇక మనం చదివిన చరిత్ర అబద్ధమా? లేక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా అల్లూరి బతికున్నా ఆయన బయటకు రాలేకపోయారా? అసలు నిజమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం డీఎన్ఏ పరీక్షలతో తెలుస్తుందేమో.