ఆ తల్లి శివగామిలా బిడ్డను కాపాడింది

October 10, 2015 | 11:31 AM | 4 Views
ప్రింట్ కామెంట్
real-shivagami-mother-died-saving-child-in-chittoor-baahubali-niharonline

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతారాలు దాటించిన చిత్రం బాహుబలి. అందులో ఓపెనింగ్ సీనే రోమాలు నిక్కబొడుచుకునేలా చిత్రీకరించాడు రాజమౌళి. చేతిలో ఉన్న చంటిపిల్లాడిని కాపాడాలని శివగామి పరిగెడుతుంది.  పరమేశ్వరున్ని ప్రార్థించి నీటిలో బిడ్డను పైకెత్తుకుని ఈదుతు ముందుకు వెళుతుంది. తాను ప్రాణాలు కోల్పోయి మరీ అమరేంద్ర బాహుబలిని కాపాడుతుంది. ఆ సీన్ బిగ్ స్క్రీన్ లో చూసినప్పుడు కలిగినంత ఆసక్తి అంతా ఇంతా కాదు. ఒక బాటిల్ తో, ఒక పూల్ లో జక్కన్న చేసిన జిమిక్కు అది. అయితే సరిగ్గా ఇలాంటి సంఘటన నిజజీవితంలో జరిగింది. తన ప్రాణాలు పోతున్నా, తన కొడుకు మాత్రం బతకాలనుకుంది. మాతృ ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన మన రాష్ట్రంలోనే జరగటం విశేషం.  

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దిగువకన్నికాపురం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి బెంగళూరులో డ్రైవర్ గా పనిచేస్తుండగా, అతడి భార్య భువనేశ్వరి (23) మాత్రం గ్రామంలోనే ఉంటూ పశువులను కాస్తోంది. ఆ దంపతులకు రెండేళ్ల కుమారుడు కరుణాకర్ ఉన్నాడు. ఎప్పటిలాగే బిడ్డను చంకనేసుకుని భువనేశ్వరి పశువులను కాసేందుకు వెళ్లింది. తాజా వర్షాలకు గ్రామ సమీపంలో అటవీ అధికారులు తవ్విన కందకం పూర్తిగా నీటితో నిండిపోయింది. అయితే లోతెంతుంటుందో తెలియని ఆ తల్లి కందకంలోకి దిగింది.

అయితే లోతు మరీ ఎక్కువగా ఉండటంతో ఆమె క్రమంగా నీటిలో మునిగిపోతోంది. ప్రమాదాన్ని గమనించిన భువనేశ్వరి తన గురించి పక్కనబెట్టి బిడ్డ ప్రాణాలను ఎలాగైనా నిలబెట్టాలనుకుంది. చంకలోని కొడుకును ఒక్క వేటుతో ఒడ్డుకు విసిరేసింది. ఆ మరుక్షణమే ఆమె నీటిలో మునిగిపోయి ప్రాణాలు విడిచింది. ఇక పిల్లాడు తల్లి కోసం అదే కందకం వైపు వెళ్తున్నాడట. సరిగ్గా అదే సమయంలో భువనేశ్వరి సమీపబంధువు ఒకరు అటు రావటం, పిల్లాడిన కాపాడటం జరిగింది. ఇక ఈ విషాదకరఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి ప్రేమను రుజువు చేసిన ఈ ఘటన ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ కదిలించివేస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ