సంచలనాత్మక వ్యాఖ్యలు చేసే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ సారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే టార్గెట్ చేశారు. బీజేపీ మతోన్మాదంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దాన్ని ఆసరాగా తీసుకొని ఆయన మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఘర్ కీ వాపసీ మోదీ ముందు తన భార్యను ఇంటికి తెచ్చుకోవాలని నారాయణ సలహా ఇస్తున్నారు. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నారాయణ ఈ కలకలంరేపే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశ సమైక్యతకు భంగం కలుగుతోందని మండిపడ్డారు. సంఘ్ పరివార్ నేతలు హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నారని నారాయణ విమర్శించారు. రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులరిజం, సోషలిజం వంటి పదాలను తొలగించాలని వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రులను ఇంకా పదవుల్లో ఎందుకు ఉంచుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. బీజేపీ ఘర్ కీ వాపసీ కొత్తగా వచ్చినది కాదని చెబుతుంది... అలా అయితే ముందు మోదీ తన భార్యను ఇంటికి తెచ్చుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.