మనుషులు ఎందుకు స్నానం చేస్తారు? మరి పశువులు? శరీర దుర్గంధ భూయిష్ఠం కాబట్టి, చీదరంగా ఉండకుండా. పశువులకు మాటరాదు గనుక ఏ పీచుతో తోమినా తలూపుతాయి. సబ్బు, షాంపూల కోసం మారం చెయ్యవు. రమారమి ఐదు కోట్ల మంది తమ మురికిని గోదారమ్మకి అంటించిన తర్వాత స్వచ్ఛ జలానికి అస్కారమెక్కడ? చరిత్ర గతితప్పి దారులూ వేరయిపోయి ఆంధ్ర గోదారి, తెలంగాణ గోదారిగా అవతరించడం జరిగిన దరిమిలా రెండు తీరాల్లోనూ ఎవరి నీళ్లు వాళ్లు నీళ్లోసుకుంటున్నారు. దీనికి గవర్నరు గారే సాక్ష్యం. దీన్ని అబేధానందం అంటారు.
తొలిరోజునే రెండు డజన్లపైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అది గోదారమ్మ ఒళ్లో జరిగితే పోనీలే పుణ్యమైనా దక్కిందనుకొనేవారు. ఇక ఈ ఘటన ఆధారంగా రాజకీయులు, అరాజకీయులు వారి వారి పైత్యాన్ని శుభ్రంగా ప్రదర్శించుకున్నారు. ఇక వివేకవంతులూ, వివాదానంద స్వాములూ సరికొత్త సిద్ధాంతాలతో తమ జ్నానాన్ని మనకి పంచినారు. నాసిక్ నుంచి నరసాపురం వరకూ ఎక్కడ మునిగినా పుణ్యం గ్యారెంటీ ఇచ్చేరు. టీవీ చర్చల్లో స్వామి వివాదానందులు తమ అక్కసునంతా తీర్చుకొన్నారు. ఈ సందులో కమ్యూనిజస్వాములు పుష్కరపనుల్లో భారీ కుంభకోణాలు జరిగినట్లు ప్రవచించేరు. ఆఖరికి నిత్యహారతి కూడా నదీమతల్లికిగాక భక్త కోటిదిశగా ఇస్తున్నారని వివాదాస్పదమవుతోంది. పోయిన ప్రాణాలు ఎలాగూ రావు, బాధ్యులు గుణపాఠం నేర్చుకుంటారని మొక్కుకుందాం. పుణ్యాధములు నదీజలాల్ని చేసిన అపవిత్రం, కాలుష్యం తొందరగా నిర్మూలించాలి. తర్వాతనే శుద్ధిజలాల్ని విదేశాలకు సీసాల్లో ఎగుమతి చేయాలి. పుణ్యంవారికి, పాపిష్టి ధనం మనకు. ఎందుకొచ్చిన పుష్కరాల్రా దేవుడా!