మనోళ్లంతా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లంటూ ఎగబడి పోతుంటే, విదేశీయులు మాత్రం మన వంటకాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా జపాన్ లోని తయోమో రాష్ట్ర గవర్నర్ తక కసుయిషీ ఆంధ్ర దోశపై ఆసక్తి కనబరిచారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇవాళ జపాన్ ప్రతినిధుల బృందం విజయవాడకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలోని గేట్ వే హోటల్ లో వారికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అందులో ఇడ్లి, దోశ, గారె, ఉప్మాలను జపాన్ బృందానికి ఆప్యాయంగా వడ్డించారు. గవర్నర్ తక కసుయిషీకి దోశ రుచి నచ్చింది. లొట్టలేసుకుంటూ తిన్నారు. అంతటితో ఆగకుండా దోశ వేసిన విధానాన్ని స్వయంగా అక్కడి వారిని ఆయన అడిగి మరీ తెలుసుకున్నారు. దోశలు తయారుచేసే విధానాన్ని స్వయంగా పరిశీలించేందుకు ఆసక్తి చూపగా కంభంపాటి రామమోహనరావు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)లు దోశల పిండి తయారీ, దోశలు వేసే విధానాన్ని ప్రత్యక్షంగా ఆయనకు చూపించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ వంటకాలు అత్యంత రుచికరంగా ఉన్నాయని ఇషీ లొట్టలేసుకుంటూ అభినందించారు.