రుణ మాఫీ విషయంలో ఏపీ ప్రభుత్వం రోజుకో కొత్త మెలికలతో రైతులకు షాకులిస్తుంది. తెలంగాణలో నివసిస్తున్న ఏపీ వాసులకు ఈ విషయంలో మొండిచేయే మిగిలేట్టు ఉంది. తెలంగాణలో ఆధార్ కార్డు ఉన్నవారికి రుణమాఫీ అవకాశం ఉండకపోవచ్చునని తెలుస్తోంది. ఆధార్ కార్డులకు సంబంధించిన డేటాను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనందున రుణమాఫీ సాధ్యం కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లి ఓటు వేసి వచ్చే వారిలో అనేకులు రైతు రుణాలను కూడా పొందారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ అలసత్వంతో వారు రుణమాఫీకి అనర్హులయ్యే ప్రమాదం ఏర్పడింది. అయితే వీరిలో చాలా మంది అర్హత లేకపోయిన రైతు రుణాలు తీసుకున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే అన్ని విధాల అర్హత ఉన్నప్పటికీ ఇలా లేనిపోని షరతులు పెట్టి రుణ మాఫీకి దూరం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.