అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటన సందర్భంగా జరిగిన హడావుడి ఏంటో అందరికీ తెలుసు. బడా నేతలకు, వీఐపీలకు కూడా అగ్ర రాజ్య అధినేతను దర్శన భాగ్యం కలగకుండా కేంద్రం కఠిన నియమాలను విధించింది. అలాంటిది ఒక తెలుగు ఎంపీ మాత్రం నేరుగా వెళ్లి ఆయనను సత్కరించడమే కాదు ఏకంగా వైట్ హౌస్ రావాల్సిందిగా ఒబామా నుంచే ఆహ్వనం పొందాడు. ఆయన ఎవరో కాదండీ... గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు. ప్రోటోకాల్ వ్యవహారాలకు సంబంధించిన శాఖకు చైర్మన్ గా ఉన్న సాంబశివరావు సోమవారం రాష్ట్రపతి భవన్ లో ఒబామాను కలసి శాలువాతో సత్కరించారు. అనంతరం తిరుపతి లడ్డూ ప్రసాదంను అందజేశారు. అలాగే అపురూపమైన ఓ ముత్యాల హారాన్ని ఒబామా భార్య మిచెల్లీ ఒబామాకు అందజేశారు. ఈ సందర్భంగా ఒబామా దంపతులు రాయపాటికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు వైట్ హౌస్ కు వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని రాయపాటిని స్వయంగా ఒబామానే ఆహ్వానించారు. గతంలో 2010లో భారత్ లో పర్యటించిన ఒబామాకు అప్పుడు కూడా బంగారంతో తయారు చేసిన అరుదైన రుద్రాక్ష హారాన్ని రాయపాటి సాంబశివరావు బహుకరించారు. ఇప్పటీకీ ఆరుసార్లు అమెరికా వెళ్లానని... కానీ ఈ సారీ అమెరికా ప్రయాణం మాత్రం తనకు అత్యంత ప్రత్యేకమైందని రాయపాటి ఈ సందర్భంగా వెల్లడించారు.