టాలీవుడ్ అగ్రహీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్నారా?. అవుననే సంకేతాలు ఇఫ్పుడు అందుతున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రాజాం పర్యటనలో ఉన్న పవన్ జీఎంఆర్ కళాశాలలో జరిగే స్వచ్ఛ్ భారత్ లో విద్యార్థులతో కలిసి చీపురు పట్టనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలోని రాజాం చేరుకున్న ఆయన ముందుగా జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రి సందర్శించి పేషంట్లతో కాసేపు మాట్లాడారు. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం నైరెడ్ లో స్వయం ఉపాధిపై శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. ఇక మధ్యాహ్నం ఆయన స్వచ్ఛ్ భారత్ లో పాల్గొంటారని సమాచారం అందుతుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... స్వచ్ఛ్ భారత్ అంటే కేవలం ఫోటోలకు ఫోజులివ్వటం కాదు. అంకిత భావంతో ఈ సత్కార్యాన్ని జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చాడు. వృత్తి పరంగా సినీ నటుడు అయిన పవన్ కళ్యాణ్‌కు... సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా మంచి పేరుంది. బహుశా ఈ వ్యక్తిత్వం నచ్చేనేమో ఈ మెగా హీరోను స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో పాల్గొనాల్సిందిగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే ఆహ్వానించాడు.