6 వాచ్ మెన్ పోస్టులు... 25 వేల అప్లికేషన్లు!!!

October 10, 2015 | 02:20 PM | 7 Views
ప్రింట్ కామెంట్
watchman-posts-btech-mba-applications-vizag-APEPDCL-niharonline

అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ లో నిరుద్యోగ స్థాయిని నిరూపించే ఘటనకు నిదర్శనమిది. క్వాలిఫికేషన్లు ఓహోగా ఉన్నా... దానికి తగ్గట్టు సరైన ఉద్యోగాలు లేక సర్టిఫికెట్లు పట్టుకుని రోడ్డున తిరిగి వారు ఎందరో... ఆ మధ్య ఉత్తరాదిన ఓ రాష్ట్రంలో ప్యూన్ పోస్ట్ కి పీహెచ్ డీ అభ్యర్థులు అప్లై చేశారని విని మనమంతా విస్మయానికి గురయ్యాం. సరిగ్గా అలాంటి మరో ఘటనే ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకోవటం విశేషం.

నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా చూడటం ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. ఆర్థిక సమస్యలతో సతమతవుతూ, రాజధాని కూడా లేకుండా పోయిన నవ్యాంధ్రప్రదేశ్ కు ఇది వర్తిస్తుంది. దీనికి నిదర్శనమే విశాఖలో జరిగిన ఓ ఘటన. ఏపీఈపీడీసీఎల్ (ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 6 వాచ్ మన్ పోస్టులకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండి, 35 ఏళ్లకు పైబడ్డ వారు దరఖాస్తు చేసకోవచ్చిన ప్రకటనలో కోరింది. అంతే... కేవలం ఆరంటే ఆరు పోస్టుల కోసం ఏకంగా 25 వేల దరఖాస్తులు వచ్చిపడ్డాయి.

పోనీ మూడేళ్ల నుంచి నోటిఫికేషన్లు లేవు కదా అందుకే ఇలా వచ్చుంటాయని సర్దిచెప్పుకుని కవర్ లు ఓపెన్ చేసిన అధికారులు షాక్ కి గురయ్యారట. అందులో సగానికి పైగా అప్లికేషన్లు గ్రాడ్యూయేట్లకు చెందినవే ఉన్నాయట. డిగ్రీలు చదివిన వారితో పాటు ప్రొఫెషనల్ కోర్సులైన ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ తదితరులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారట. షాక్ నుంచి తేరుకున్న వారిలోంచి 317 మందిని షార్ట్ లిస్ట్ చేసి, 2.5 కిలో మీటర్ల పరుగు పోటీ నిర్వహించగా, 35 మంది సెలక్టయ్యారట. ఇక తదుపరి పరీక్షల అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఇది దేశంలో కాదు కాదు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగుల దుస్థితి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ