గోదావరి పుష్కరాల ప్రారంభంరోజునే అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 25 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పుష్కరాల ప్రారంభంరోజునే అంచనాకు మించి భక్తులు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు పుష్కరస్నానం ఆచరించిన అనంతరం బస్సులోకి వెళ్లగా ఆదే సమయంలో ఒక్కసారిగా ప్రజలు దూసుకువచ్చారు. దీంతో తీవ్ర తోపులాట జరిగింది. చిన్నపిల్లలు, వృద్ధులు హాహాకారాలు చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు భయంకరమైన పరిస్థితి నెలకొంది. పోలీసులు దాదాపు గంటపాటు శ్రమించి పరిస్థితిని అదుపుచేశారు. కాగా పుష్కర ఘాట్ల వద్ద అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రి చిన్న నగరం కావడం, అంచనాలకు మించి జనం రావడంతో అధికారులు చేతులెత్తేశారు. పుష్కర సమయానికి కంటే ముందుగానే మైకుల్లో పదేపదే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా లాభం లేకపోయింది. ఇక ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం పరంగా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఒకే ఘాట్‌కు ఎక్కువమంది రావడంతో తొక్కిసలాట జరిగిందని ఆయన తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పుష్కర ఘాట్ల వద్ద అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఈ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబునాయుడు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి బయలుదేరి వెళ్లారు.