ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం గందరగోళం నెలకొని ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేస్తుండడంతో, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు కల్పించకోని ప్రతిపక్షనేతకు కౌంటర్లు వేశారు. రుణమాఫీపై సభలో చర్చించాలని చెప్పిన మీరే ఇప్పుడు అడ్డుతగులుతుంటే ఎలా? అని ప్రశ్నించారు. అంతకుముందు జగన్... కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందన్నారని, కానీ, ఉన్న జాబులు పోతున్నాయని వ్యాఖ్యానించారు. నాలుగు రోజులుగా 15,000 మంది కాంట్రాక్టు కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారని, అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు కాల్వ ఘాటుగా బదులిచ్చారు. జగన్ మాటలు వింటే వైఎస్సార్సీపీ సభ్యుల జాబులే పోతాయని ఎద్దేవా చేశారు. రాద్ధాంతం చేయకుండా సభ సాఫీగా జరిగేందుకు సహకరించాలని కోరారు.