తుపాకుల్లాంటి మారణాయుధాలు కావాలంటే ఏ బీహార్ కో లేక యూపీ కో వెళ్లాలని సినిమాల్లో రౌడీలు చెబుతుంటే వింటుంటాం. అయితే అంత దూరం శ్రమ ఎందుకనుకున్నారో ఏమో విజయవాడ లోని లక్ష్మీ దుర్గ ఇంజనీరింగ్ వర్క్స్ పరిశ్రమ నిర్వాహకులు. ప్రత్యేక టీంలతో సోదాలు నిర్వహించిన ఏలూరు పోలీసులకు విజయవాడ ఆటోనగర్ లో జరిగే ఆయుధాల వ్యవహారం చూసి ఆశ్చర్యపోయారు. లక్ష్మీదుర్గ ఇంజనీరింగ్ వర్క్స్ పై నిర్వహించిన సోదాల్లో తుపాకుల కార్ట్రిడ్జిలు, బుల్లెట్లు, ఇతర పరికరాలు భారీ ఎత్తున పట్టుబడ్డాయి. వారం రోజుల క్రితం నెల్లూరు ప్రాంతానికి చెందిన శరత్ రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. అతడు మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారు పట్టుకున్నారు. పోలీసులు అతడిని విచారించగా... విజయవాడలో ఆయుధాల తయారీ వ్యవహారం మొత్తం బయటపడింది. దాంతో ఏలూరు నుంచి ప్రత్యేక బృందాలు విజయవాడకు వచ్చి తనిఖీలు నిర్వహించగా ఈ గుట్టు బయటపడింది. నగరం నడిబొడ్డున ఆయుధ పరికరాలు పెద్ద ఎత్తున స్వాధీనం కావటంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక కాబోయే రాజధానిలో ఆయుధాల కలకలం రేగటంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.