‘తనూ వెడ్స్ మనూ’ సీక్వెల్ సినిమా నిర్మాతలకు కలెక్షన్ల పంట పండిస్తోంది. దేశీయ మార్కెట్లో 12వ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ఇది నిలిచింది. కంగనా రనౌత్, ఆర్.మాధవన్ నటించిన ఈ సినిమాను కేవలం రూ.31 కోట్లతో నిర్మించగా ఇప్పటివరకు రూ.145 కోట్లు వసూలు చేసి దాదాపు 115 కోట్లకు పైగా లాభాలను ఆర్జించి పెట్టింది. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజైన నాలుగు వారాల తర్వాత కూడా అదే కలెక్షన్లను రాబడుతోంది. సల్మాన్‌ఖాన్ మూవీ ‘బజరంగీ భాయ్’ జాన్ జులై 16 న విడుదల కాబోతోంది. అప్పటికి ‘తనూ వెడ్స్ మనూ’ సీక్వెల్ రాబడి రూ.150 కోట్లకు పెరగవచ్చునని భావిస్తున్నారు. 2011లో వచ్చిన తను వెడ్స్ మనూ చిత్రంలో కూడా మాధవన్-కంగనా జంటగా నటించారు. ఇప్పుడు విడుదలైన ఈ సినిమాలోనూ అదే జంట నటించింది. కాగా ‘పీకే’, ‘ధూమ్’, ‘క్రిష్-3’, ‘చెన్నై ఎక్స్ ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘3 ఇడియట్స్’, ‘ఏక్ థా టైగర్’, ‘ఏ జవానీ హై దీవానీ’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రాల అనంతరం ఈ మూవీ భారీ హిట్ చిత్రంగా నిలిచింది.