జయం సినిమాలో.... వెళ్ళవయ్య వె ళ్ళూ... అంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన సదా... ఈ మధ్య కాలంలో సినిమాలకు దాదాపు దూరమై పోయింది. ఆమె సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు పన్నెండు సంవత్సరాలు దాటింది. కానీ ఆమెలో ఏ మాత్రం మార్పు రాకపోయినప్పటికీ ఎందుకో మరి, సినిమా అవకాశాలు తగ్గిపోయినాయి. కారణం... ఆమె సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడం అయి ఉండవచ్చు. అడపా దడపా ఓ డాన్స్ తో సినిమాలు వచ్చినా, అవి కూడా ఫట్ అవడంతో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. తెలుగు బుల్లి తెర మీద ఓ డాన్స్ షోలో కనిపిస్తూ తన అందచందాల్లో ఇప్పటికీ ఏ మార్పు రాలేదని నిరూపించుకుంటోంది. ముంబాయి అమ్మాయే అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతూ టీవీ షోలో గెస్ట్ గా కనిపిస్తోంది. అయితే ఇన్నాళ్ళ తరువాత తమిళ చిత్రంలో ఓ అవకాశం వచ్చింది సదాకు. కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు నటిస్తున్న 'ఎలి' అనే సినిమాతో సదా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎలి అంటే ఎలుక అని అర్థం... ఆ మధ్య ఎన్నికల్లో పులి మాదిరి గర్జించినవడివేలు ఇప్పుడు ఎలుక మాదిరి అయిపోయాడు. తమిళ సినీ, రాజకీయ నాయకుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వడివేలును కోలీవుడ్ వర్గాలు పక్కన పెట్టేశాయి. దీంతో బుద్దొచ్చి నోటివాటాన్ని తగ్గించుకున్నాడు. ఇప్పుడు 'ఎలి' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఎలుక తరహాలో అతని నటన ఉంటుందని అందుకే ఈ పేరు పెట్టామంటున్నారు దర్శకుడు యువరాజ్. అయితే సదాకు ఈ సినిమాలో ఓ పాత్ర చేసే అవకాశం దక్కింది. ఈ సినిమాతో అయినా మళ్ళీ సినిమా ఛాన్స్ లు దక్కించుకుంటుందేమో చూద్దాం.