ప్రేమను పొందడం, ఇవ్వడం రెండూ గొప్ప విషయాలే... అయితే అమితాబ్ బచ్చన్ తన కుటుంబ సభ్యుల ప్రేమకు నిర్వచనాలు బాగానే చెపుతుంటాడు... ఏదో ఓ సందర్భంలో వారి గురించిన ముచ్చట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేసి మురిసిపోతుంటాడు. అయితే 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశం ఇచ్చాడు. అందులో ఆయన కుమార్తె ప్రేమకు నిర్వచనం చెప్పడం చాలా కష్టమని, అదొక అనిర్వచనీయమైన అనుభూతి అని చెప్పాడు. తన కుటుంబంలో కుమారునితో పాటు కుమార్తెకూ పూర్తి స్వాతంత్య్రం ఇచ్చానన్నారు. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోక్ స్టూడియోస్, ఎంటీవీ సంయుక్త ఆధ్వర్యంలో తండ్రీకూతుళ్ల చేత పాడించిన ఓ ప్రేరణ గీతానికి అమితాబ్ తన మద్దతు తెలిపారు. ఐ వాన్నా ఫ్త్లె.. (నాకు ఎగరాలని ఉంది..) అనే ఈ గీతాన్ని జావెద్ అఖ్తర్ రాయగా బాబుల్ సుప్రియో, ఆయన కుమార్తె షర్మీలీ కలిసి పాడారు. ఈ వీడియోలో బిగ్ బీ కూడా తన సందేశాన్ని వినిపించారు. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. బిగ్ బీ ఈ వీడియోలో కూతుళ్లకు కూడా సమాన హోదా ఇవ్వండి అని అభ్యర్థించారు. ఈ వీడియోను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు షేర్ చేస్తూ.. ఓ లెజెండ్ ఇచ్చిన సందేశం అంటూ వ్యాఖ్యానించారు.