సల్మాన్ ను ఐదేళ్ళు జైల్లో పెట్టడం అనేది నిజంగా అందరికీ ఒక షాక్ లాంటిది. ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఓ ప్రముఖ వ్యక్తి. అతనికి శిక్ష పడదనే అభిప్రాయంతో చాలా మంది ఆయనతో సినిమా చేయాలని కలలు కంటున్నారు. ఇలా సల్మాన్ ను దోషిని చేయడం చాలా మందికి జీర్ణించుకోలేని అంశం అయ్యింది. కరణ్ జోహార్, సాజిద్ నదియాడ్వాలా, సూరజ్ బార్ జాత్యా, ఆదిత్య చోప్రా వంటి పెద్ద పెద్ద నిర్మాతలు, డైరెక్టర్లు కోర్టు తీర్పుతో డీలా పడిపోయారు. సల్మాన్‌తో సినిమాలు తీయాలనుకున్న వీరంతా ఇప్పుడు డైలమాలో పడ్డారు. శుద్ధి అనే పేరుతో తాను సల్మాన్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు కరణ్ జోహార్ ఇదివరకే అనౌన్స్ చేశాడు. అలాగే అతనితో ఓ యాక్షన్ థ్రిల్లర్ నిర్మించేందుకు ఆదిత్య చోప్రా రెడీ అయిపోయారు. వీరితో పాటు ఇంకా చాలా మంది అయోమయంలో పడ్డారు. సల్మాన్‌తో ముడిపడిన కోట్లాది రూపాయల సినీ ప్రాజెక్టుల భవితవ్యం గందరగోళంలో పడింది. ఇక ఇప్పటికే చాలావరకు షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' వంటి చిత్రాల రిలీజ్ సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. మరో రెండేళ్ళ వరకు అంటే 2017 వరకు.. సల్మాన్ తనకు ఉద్దేశించిన సినీ ప్రాజెక్టులపై సంతకాలు చేశాడు. అయితే కోర్టు తీర్పు కారణంగా ఈ ప్రాజెక్టులకు సుమారు 200 కోట్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. ఇంకా ఇవి కాకుండా పది బ్రాండ్లకు సల్మాన్ ప్రచారకర్తగా ఉన్నాడు. ఇవి కూడా కొన్ని కోట్ల రూపాయల విలువైనవే. కాగా బాలీవుడ్ స్టార్స్ అంతా తమ ట్విట్టర్స్ లో సల్మాన్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. అతన్ని ఈ శిక్ష పడడం చాలా బాధగా ఉందనీ, మేమంతా ఆయనకు అండగా ఉంటామని ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు.