తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాహనాలపై ప్రవేశ పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు టాక్స్ మినహాయింపు ఉంది. మరీ సోదర రాష్ట్ర విషయంలోనే ఈ షరతు ఏంటని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు వివాదాస్పదమైన ఈ జీవో 15ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉమ్మడి రాజధానికి వచ్చే వాహనాలపై పన్నులు విధించడం సరికాదని వారంటున్నారు. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వానికొచ్చే ఆదాయంకి గండి పడే అవకాశంతోపాటు ఇక్కడి వ్యాపారస్తులకు నష్టం కలుగుతుందని వారంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి పన్ను విధానం అవలంభించాలని వారు అంటున్నారు. డిమాండ్లకు సానుకూలంగా స్పందించని పక్షంలో ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ కలిసి పోరాటానికి సిద్ధమవుతామని వారంటున్నారు. ఇదే తోవలో మిగతా ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్స్ సంఘాలు కూడా తెలంగాణ ప్రభుత్వానిపై సమరానికి సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 1 కానుకగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావచ్చుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.