తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుపై విశ్వహిందూపరిషత్ చీఫ్ ప్రవీణ్ తొగాడియా ఆగ్రహాం వ్యక్తంచేశాడు. కేసీఆర్ పాలనలో హిందువులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. గురువారం శంషాబాద్ లో వీ.హెచ్.పీ భాగ్యనగర్ వెబ్ సైట్ ను ప్రారంభించి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మతపరమైన రిజర్వేషన్ లతో ముస్లింలకు లాభం చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో కేవలం ముస్లింలకే అవకాశాలు కల్పిస్తున్నారని, వెనుకబడిన హిందువుల కుటుంబాలకు అవకాశాలు లేవని ఆయన అన్నారు. కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని అన్నారు. నాడు నిజాం పాలనపై ఏవిధంగా పోరాటాలు చేశామో...ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై కూడా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యలు చేశారు. హజ్ యాత్రలకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం హిందువులను పట్టించుకోవటం లేదని విమర్శించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా తొగాడియా సంగారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూలు, కడపలో పర్యటించనున్నారు. శుక్రవారం ఆయన బెంగళూరు వెళతారు.