తెలంగాణ లో బుధవారం నల్గొండ దగ్గర రోడ్డు నెత్తురోడింది. ఘోర రోడ్డు ప్రమాదం సంభవించటంలో 15 మందికి పైగా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి. అతివేగంగా వస్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 15 మంది అక్కడిక్కడే చనిపోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. నార్కట్ పల్లి డిపోకు చెందిన 2102 నంబర్ గల ఎక్స్ ప్రెస్ బస్సు భువనగిరి నుంచి నల్గొండ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
రామన్నపేట మండలం ఇంద్రపాల్ నగరం వద్ద ఈ ఘోరం చోటుచేసుకుంది. రెండు వాహనాలు అధిక వేగంతో ప్రయాణిస్తుండటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా డ్రైవర్ సీటు వైపు కూర్చునవారంతా మరణించారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని భువనగిరి, నల్గొండ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. భువనగరి, నల్గొండల నుంచి రెస్క్యూ టీంలు వచ్చి శకలాలను తొలగిస్తున్నాయి. కొన్ని మృతదేహాలు బస్సు-లారీల మధ్య ఇరుక్కుపోవటంతో ఘటనా స్థలం అంతా రణరంగాన్ని తలపిస్తుంది.