ప్రముఖ సినీ నటుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ ను హత్య చేస్తామని బెదిరింపు మేసేజ్ వచ్చింది. 'ఇన్ టోలరెంట్ చంద్ర' అనే యూజర్ నేమ్ తో ట్విట్టర్ లో బెదిరింపు పోస్టింగ్ చేశారట. ఇప్పటికైతే, దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని సమాచారం. ఆయన ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీసులు చెబుతున్నారు. గిరీశ్ కర్నాడ్ ఆనంద భైరవి, ధర్మక్షేత్రం, ప్రేమికుడు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అసలు ఆయనను చంపుతామన్నంత కసి ఎవరికి ఉంది అంటే.. ఇటీవల కర్ణాటకలోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేరు మార్చాలని ప్రభుత్వం పరిశీలనలో ఉంది.
అయితే ఆ ఎయిర్ పోర్ట్ కి బ్రిటీష్ వారిని గడగడలాడించిన మైసూర్ పాలకుడు టిప్పుసుల్తాన్ పేరు పెట్టాలని గిరీశ్ కర్నాడ్ సూచించారు. దీంతో కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హిందువులను, వక్కలిగ వర్గ ప్రజలను కర్నాడ్ అవమానించారని ఆరోపిస్తూ, కొందరు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. దీంతో ఆయన దిగిరాక తప్పలేదు. మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణలు చెప్పాడు. అయినా చెలరేగిన వేడి ఇంకా చల్లారలేదు. ఇక ఇప్పుడు చంపుతామని రావటంతో ఆయన కుటుంబ సభ్యుల్లో కలవరం మొదలైందట. మరోవైపు ఈ కామెంట్లు రాజకీయం చేస్తూ అక్కడి వీహెచ్ పీ సంఘాలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నాయి. గిరీశ్ కర్నాడ్ ను సిద్ధరామయ్య అనుచరుడిగా అభివర్ణిస్తూ దిష్టిబోమ్మలను దహనం చేస్తున్నాయి.