‘అలియాస్ జానకీ’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనిషా ఆంబ్రోస్ కు మెగా ఛాన్స్ దక్కింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2 చిత్రంలో ఈ వైజాగ్ అమ్మడు హీరోయిన్ గా ఎంపికైంది. ఎంతో మంది పేర్లు పరిశీలించినప్పటికీ చివరికి ఈ తెలుగమ్మాయినే అదృష్టం వరించింది. ‘పవర్’ చిత్ర దర్శకుడు బాబీ(రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు నిర్మాతలు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. గబ్బర్ సింగ్ చిత్రంలోని నటీనటులు ఇందులో కూడా ఉన్నప్పటికీ ఇది ఆ చిత్రానికి సీక్వెల్ కాదని పేర్కొంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్త సారథ్యంలో ఈ చిత్రం నిర్మితం కానుంది. చిత్రానికి సినిమాటోగ్రఫీ జే.విన్సెంట్, దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు. చిత్రీకరణ త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్రయత్నాలు కొనసాగనున్నాయి.