మెగా అభిమానులంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బసింగ్’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే కొత్త సమస్య వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ లో కాస్త ఆందోళన నెలకొంటే, అభిమానులు మాత్రం పండగ చేస్కుంటున్నారు. ఈ చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ చిత్ర నిర్మాణ సంస్థలైన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపించాడు.
కాపీ రైట్స్ హక్కులను ఉల్లంఘించి ఈ చిత్రాన్ని నిర్మించారనేది ఆర్భాజ్ ఆరోపణ. అయితే గతంలో గబ్బర్ సింగ్ టైంలో కూడా ఇలాగే టైటిల్ విషయంలో వివాదం రాజుకుంది. సరిగ్గా చిత్ర విడుదలకు వారం రోజుల ముందుగా కొందరు హిందీ నిర్మాతలు ఆ టైటిల్ మాదేనంటూ కోర్టుకెక్కారు. అందుకోసం పాతిక లక్షలు చెల్లించాలని నిర్మాత బండ్ల గణేష్ ను డిమాండ్ చేశారు. అంత సర్దుకుని చిత్రం విడుదలయి ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే. ఇక ఇప్పుడు అర్భాజ్ ఖాన్ నోటీసులు పంపించడం, నిర్మాతలు రంగంలోకి దిగటం చూస్తున్న అభిమానులు ఇది కూడా గబ్బర్ సింగ్ లాగే రికార్డులు సృష్టిస్తుందని నమ్ముతున్నారు. అదసలు చిన్న విషయమని, పైగా పవనే నిర్మాత కావటంతో అంతా ఆయనే చూస్కుంటాడని లైట్ తీస్కుంటూ అభిమానులు మాత్రం పండగ చేస్కుంటున్నారు.