ఇంకా విడుదలకు నెల రోజుల సమయం ఉందనగా... బాహుబలి టికెట్స్ మొత్తం బుక్ అయి పోయాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేకపోయినా... టికెట్ల బుకింగ్ మొదలైతే జనాలు టికెట్ల కోసం ఏ విధంగా ఎగబడతారో ఊహించలేం... ఈ డిమాండ్ ను బుకింగ్ వెబ్ సైట్లు, థియేటర్లు ఎలా తట్టుకుంటాయో అనే సందేహం అందరిలో కలుగుతోంది. అయితే ఈ డిమాండ్ ను ముందుగానే అంచనా వేసిన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అప్పుడే బుకింగ్ మొదలు పెట్టారు. జులై 10న విడుదలవుతున్న ఈ సినిమా బుకింగ్ ఓపెన్ చేశారు. ఇంతకూ ఈ సినిమా ఆ రోజున విడుదలవుతుందా లేదా అనే సందేహం కూడా లేకుండా... ఏకంగా బుకింగ్స్ మీద పడిపోయారు అక్కడి అభిమానులు. ఒక్కో టికెట్ ధర 40 డాలర్లు కాగా, హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఇలాగే మరికొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ చేశారు. నెల రోజులకు ముందైనా సరే టికెట్లు కొనడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పటి వరకూ ఏ సినిమాకూ లేనంత స్థాయిలో భారీగా ప్రిమియర్ షోలకు ప్లాన్ చేస్తోంది బాహుబలి టీం. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో బెనిఫిట్ షోలు ఉంటాయని చెబుతున్నారు. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ దాదాపు ఇప్పటి వరకూ ఏ సినిమాకూ లేనంత స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.