టీఎస్ఆర్, టీవీ9 జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా జరిగింది. టీ. సుబ్బిరామి రెడ్డి, టీవీ9 సంయుక్తంగా నిర్వహించిన వేడుకలో ఉత్తమ సినీ సెలబ్రిటీలుగా ఎంపికైనవారికి అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న ప్రముఖులు ఉచితరీతిన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ ఫంక్షన్ ఓ అరుదైన దృశ్యం అందరినీ కనువిందు చేసింది. ‘టీఎస్సార్ - టీవీ9’ గతంలో ఒకరంటే ఒకరికి ఏ మాత్రం పొసగని ఇద్దరు హీరోలు, ఓ సీనియర్ నటి ఒకే వేదికపైకి రావడం విశేషం. వాళ్లెవరోకాదు మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు, నటి జీవితలు. వీరు ముగ్గురూ ఒకే వేదికపై కనిపించారు. వీళ్లని చూడగానే సినీ లవర్స్ రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఒకరిపై మరొకరు వాగ్బాణాలు సంధించే ఈ ముగ్గురు ఎలా కలిసి పోయారంటూ చర్చించుకోవడం కనిపించింది.
మరో విశేషం ఈ వేడుకలో రాజమౌళి సినిమా బాహుబలిని మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటుడు రిషికపూర్ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సినిమా ఆద్యంతం అద్భుతంగా ఉందని, అంతర్జాతీయ హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతోందని చిరు అన్నారు. మన తెలుగువాడు రాజమౌళి ఇలాంటి చిత్రం తీయడం మనకు గర్వ కారణమన్నారు. ఇక రిషికపూర్- ఈ సినిమా గురించి తన ట్విటర్లో ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సినిమా అన్నదానికి భాషతో నిమిత్తం లేదని, ఇండియాలోనే కాక, మొత్తం ప్రపంచంలోనే ఈ మూవీకి మంచి గుర్తింపు లభించిందని రిషికపూర్ పేర్కొన్నారు. రానా, తమన్నాలను ప్రత్యేకంగా అభినందించారు.