భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సోమవారం హఠాత్తుగా కనుమూశారు. యావద్భారత దేశం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆయన మృతికి భారతావని కన్నీరు పెట్టుకుంది. అబ్దుల్‌కలాం ఎంతటి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారన్నది ఆయన మృతికి దేశం స్పందించిన తీరే చెపుతుంది. ప్రతి ఒక్కరూ ఆయనకు మీడియా ద్వారా సోషల్ నెట్ వర్క్ ద్వారా నివాళులు తెలుపుతోంది. సినీ ప్రముఖులు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
మంచు మోహన్ బాబు: "దేశంలోని ఎంతో మంది యువతకు కలాంగారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు. స్వయంకృషితో అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఎంత ఎదిగినా నిరాడంబరంగా ఉండటం ఆయనకే చెల్లుతుంది. యువతను ప్రేరేపిస్తూ వారే దేశాన్ని ముందుండి నడిపించాలనేవారు. ఏ అవార్డులు చేపట్టినా, పదవులు అలంకరించినా వాటికి వన్నె తెచ్చారు. అందరిలో ఆయన రగిలించిన స్ఫూర్తి మరచిపోలేం. అటువంటి ఉన్నత వ్యక్తి, మేధావి మనల్ని విడిచిపెట్టి వెళ్లి పోవడం తీరనిలోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ సాయినాథుని, వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను"
నందమూరి బాలకృష్ణ: "కృషి ఉంటే మనుషులు మహోన్నత స్థానానికి చేరుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి రాష్ట్రపతి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప పర్సనాలిటీ. దేశానికి సైంటిస్ట్ గా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు కొనయాడదగ్గవి. ఆయన ఒక సైంటిస్ట్ భారతదేశాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టారు. ఎప్పుడూ యువత అన్నింటా ముందుండాలని కోరుకునేవారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరణం మన దేశానికే తీరని లోటు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను."
హీరో నారా రోహిత్: 'ఎన్నో పదవులు చేపట్టిన నిగర్వి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. నేను ఆయన ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనను చూసి క్రమశిక్షణ నేర్చుకున్నా. పెద్దలతో ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలనే విషయాలను తెలుసుకున్నాను. ఒక శాస్త్రవేత్తగా దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలపడమే కాదు, తన నడవడికతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. యువత దేశాభివృద్ధికి ఎంతో అవసరమమని, అందరూ చదువుకోవాలని అందరినీ ఉత్తేజ పరిచేవారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఉన్నట్లుండి మనల్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం. ఆయన లేని లోటు తీర్చలేనిది’’ అన్నారు.