ఇప్పుడు బాహుబలి విలన్ రానా హవా బాగా నడుస్తోంది. బల్లాల దేవ క్యారెక్టర్ ఆయనకు బోలెడు ఆఫర్లు తెచ్చి పెడుతోంది. ఒక వైపు సినిమాలు, మరో వైపు ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రేంజ్ లో క్లిక్ అవుతానని రానా కూడా అనుకుని ఉండడు. ఇప్పుడు మహేష్, బన్నీ, చరణ్ ల తరువాతి వరుసలో రానా ఉన్నారు. నిన్ననే ఓ ప్రఖ్యాత వాచ్ కంపెనీతో రానా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఓ అధికారిక ప్రెస్ మీట్ లో సూటూ బూటులో తళుకులీనాడు. కనీసం 45000 నుంచి 65000 మధ్య ధరలు పలికే 'టిస్సాట్' వాచీలకు ప్రమోటర్ గా ఎంపికయ్యాడు. యూత్ లో రానాకి పెరిగిన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సదరు సంస్థ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రానా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్. అందుకే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఇలా వెంటపడుతున్నాయి. ఇక సినిమా ఆఫర్లు అంతే మరీ మనోడు ఇప్పటికే బాలీవుడ్ కోలీవుడ్ జనాలకు పరిచయస్తుడే కాబట్టి ఇక టాలీవుడ్ తో పాటు అక్కడ కూడా ఆఫర్ల పంట పండనుంది.