తుమ్మెదా... ఓ తుమ్మెదా... ఎంత తుంటరోడె గోరింకుడు... తుమ్మెదా... అంటూ వెంకీతో శ్రీనివాస కళ్యాణం లో తెలుగువారి సంప్రదాయ లంగా ఓణీలో చిందులేసి అందరి దృష్టినీ ఆకర్షించింది గౌతమి. 19 ఏళ్ళ వయసులోనే గౌతమి సినీ ప్రస్థానం మొదలు పెట్టింది. వివాహానంతరం నటనకు గుడ్ చెప్పి, మళ్ళీ ఇన్నాళ్ళకు తన సహచరుడు కమల్ హాసన్ తో నటిస్తోంది. గౌతమి నేటితో (జులై 2) 49లోకి అడుగు పెట్టింది. తెలుగునాట పుట్టి, తమిళనాట తారగా వెలిగిన గౌతమి ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే టాప్ స్టార్ కమల్ హాసన్‌తో సహజీవనం చేస్తోంది. 1987లో తెలుగు చిత్రం ‘దయామయుడు’తో గౌతమి నటిగా జీవితం ఆరంభించింది. రాజేంద్రప్రసాద్ సరసన గాంధీనగర్ రెండో వీధిలో నాయికగా నటించింది. ఆ తరువాత మరి వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు సాగింది. మాతృభాష తెలుగులో చేసింది కొన్ని చిత్రాలే అయినా, తమిళనాట కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల తో పలు విజయాలను చవిచూసింది.
1998లో ఓ బిజినెస్ మాన్ ను పెళ్ళి చేసుకుంది. 1999లో కూతురు సుబ్బులక్ష్మి పుట్టింది. అదే సంవత్సరం భర్త నుంచి విడిపోయి ధైర్యంగా బయటకు వచ్చింది. ఆ సమయంలో ఆమెకు కమల్ హాసన్ అండగా నిలిచాడు. వారిద్దరూ ప్రస్తుతం సహజీవనం సాగిస్తున్నారు. కమల్ ప్రోత్సాహంతో గౌతమి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. దాదాపు పదహారేళ్ళ తరువాత గౌతమి నటిస్తోంది... అదీ కమల్ హాసన్ సరసనే కావడం విశేషం. మళయాళ, తెలుగు భాషల్లో విజయం సాధించిన దృశ్యం ఆధారంగా తెరకెక్కిన పాపనాశం చిత్రంలో గౌతమి, కమల్ తో జోడీ కట్టింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు గౌతమి పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించిన కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ నీహార్ ఆన్ లైన్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.