హీరోలు చాలా మంది 50, 60 ఏళ్ళు వచ్చినా హీరోయిన్ తో చట్టాపట్టాలేసుకుని పార్కుల్లో తిరిగే హీరోల్లా నటించడానికే ఇష్టపడేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పటి హీరోల్లో నాగార్జున, జగపతి బాబు లాంటి వారు ఓపెన్ గా తమ ఏజ్ చెప్పుకోడానికి గానీ, తమ వయసుకు తగిన పాత్రలు చేయడానికి గానీ వెనుకాడ్డం లేదు. ఇది వారి మీద అభిమానాన్ని మరింత పెంచే అంశం. నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తనతో నటించడానికి కొందరు హీరోయిన్లు ఇష్టపడ్డం లేదని చాలా ఓపెన్ గా చెప్పుకున్నాడు. కారణం తన వయసే అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు జగపతి బాబు కూడా ఓ హీరోగా నటించి విలన్ గా, తండ్రిగా నటించడానికి ఎలాంటి ఇబ్బందీ పడడం లేదు. శ్రీమంతుడు సినిమాలో జగపతి బాబు మహేష్ బాబుకు తండ్రిగా నటించాడు. క్యారెక్టర్ పరంగా అతనిదీ మెయిన్ రోలే అని చెప్పాలి. నిజానికి మహేష్ బాబుకంటే ఆయన పదేళ్ళే పెద్ద. ఒక్క తెల్లగడ్డం తప్ప... ముఖంమీద వయసు పైబడ్డ ఛాయలు కూడా కనిపించడం లేదు. ఆయన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాక జగ్గూభాయ్ కి వచ్చిన హిట్లలో శ్రీమంతుడు ఒకటి. జగపతిబాబు కూడా ఓ హీరోనే కాబట్టి ఇది మల్టీ స్టారర్ సినిమా అని చెప్పాలి. జగపతి బాబు కూడా అందగాడే కాబట్టి అందగాడైన హీరో తండ్రిగా చాలా బాగా కుదిరాడు. ఈ సినిమా హిట్ కావడంపై జగపతి బాబు చాలా హ్యాపీగా ఉన్నాడిప్పుడు. ఎంత విలన్ గా మారినా... ఎంత తండ్రి పాత్రల్లో నటిస్తున్నా ఆయన్ని నేటికీ ప్రేక్షకులు ఓ హీరోలాగానే చూస్తున్నారు. కారణం... ఆయన హీరోగా చేసిన సినిమాలన్నీ నిన్నమొన్న వచ్చినట్టుగానే ఉన్నాయి... పైగా తెల్లగడ్డం దాచుకోకుండా బయటికి కనిపిస్తున్నా... ఇప్పటికీ హీరోలాగానే ఉన్నాడు కాబట్టి.