దాదాపు మూడు సంవత్సరాలు విరామం లేకుండా బాహుబలి కోసం శ్రమించారు దర్శక ధీరుడు రాజమౌళితో పాటు ఆయన కుటుంబం. ఈ సినిమా తెచ్చిన సక్సెస్ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకన్నట్టు ఫామిలీతో విదేశీ విహారయాత్రకు వెళ్ళారు రాజమౌళి. తిరిగి వచ్చి అక్కడి విశేషాలను ఫేస్‌బుక్ లోనూ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ముఖ్యంగా బుసాన్‌లో 'బాహుబలి' ప్రదర్శన తర్వాత జక్కన్నను అక్కడివారికి 'ఈగ' దర్శకుడు అని పరిచయం చేశారట. 'ఈగ'ను 2012 బుసాన్‌లో ప్రదర్శించారట. అక్కడ ఈగ దర్శకుడు అనే చెప్సే సరికి కొరియన్లలో విపరీతమైన స్పందన కనిపించిందన్నారు రాజమౌళి. ఆ కార్యక్రమం పూర్త్తెన తర్వాత చాలామంది 'ఈగ' డీవీడీ మీద ఆటోగ్రాఫ్ తీసుకున్నారని ట్వీట్ చేశారు. అంతే కాదు తన కెరీర్‌కు ఈ సినిమా ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈగకు థాంక్స్ చెప్పుకున్నారు.
దక్షిణ కొరియాలోని బుసాన్‌లో ప్రపంచ చలన చిత్రోత్సవం జరుగుతున్న విషయం తెలిసిందే. వివిధ దేశాల గొప్ప చిత్రాలను అక్కడ ప్రదర్శిస్తుంటారు. అక్కడి చలన చిత్ర ప్రదర్శనలో పాలు పంచుకున్న రాజమౌళికి అక్కడి వారు తన ఆటో గ్రాఫ్ కోసం క్యూ కట్టడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. బుసాన్ చిత్రోత్సవంలో 'బాహుబలి: ది బిగినింగ్'ను అక్టోబర్ 4న ప్రదర్శించారు. ఇంకా రెండు సార్లు బాహుబలిని ప్రదర్శించబోతున్నారట అక్కడ.
రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడుతూ ''బాహుబలి: ది బిగినింగ్' విజయం వెనుక విజువల్ ఎఫెక్ట్స్, యుద్ధం నేపథ్యంలోని సన్నివేశాలది ప్రముఖ స్థానం. 'బాహుబలి' రెండో భాగం నుంచి ప్రేక్షకులు ఎంతగా ఆశిస్తున్నారో మాకు అర్థమైంది. వాళ్లను నిరాశపరచకూడదని మా బృందం ఎంతో కష్టపడుతోంది. 'బాహుబలి: ది కంక్లూజన్' భారీగా ఉండబోతోంది. తొలి భాగాన్ని మించిపోయే భావోద్వేగాలతో రెండో భాగాన్ని తీర్చిదిద్దుతాం'' అన్నారు.