ఇండస్ట్రీలో పనిచేసే నటీమణులంటే జనాలకు ఓ చులకన చూపు ఉంటుంది. వారిపై తరచు లైంగిక వేధింపులు జరగటం మనం వింటూ ఉంటాం. షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లే టైంలో ఆకతాయిల కామెంట్లు, లైంగికవేధింపులు, మరీ ముందుకు వెళ్లి అప్పుడప్పుడు లైంగికదాడులు జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ బుల్లితెర నటిపైన అందులోనూ సెట్లోనే ఉండగానే లైంగిక వేధింపులు జరిగిన ఘటన చోటుచేసుకోవటం విశేషం.
వివరాళ్లోకి వెళ్లితే... ప్రముఖ హిందీ సీరియల్ నటి రతన్ రాజ్ పుత్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రముఖ చానెల్ లో జై సంతోషి మా సీరియల్ ఆమె లీడ్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలసిందే. ఇదే సీరియల్ లో భాగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ లైట్ మెన్ ఆమె దగ్గరగా వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేయటంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించాడట. వెంటనే ఆమె కేకలు వేయటంతో యూనిట్ సభ్యులంతా ఆమె చుట్టూ చేరి అసలు విషయం తెలుసుకున్నారట. వెంటనే రతన్ అతగాడితో క్షమాపణలు చెప్పించాలని పట్టుబట్టిందట. కానీ, నిర్వాహకులు ఆమె వాదనను లైట్ తీస్కోవటంతో తానింక షూటింగ్ చేయనని తేల్చిచెప్పిందట. చేసేది లేక వెంటనే ఆ లైట్ మెన్ ను తొలగించటంతో తిరిగి ఆమె షూటింగ్ లో చేరినట్లు తెలుస్తోంది. దీనిపై ఆరాతీసిన మీడియాకు సీరియల్ సిబ్బంది మౌనమే సమాధానం అయింది.